గుంటూరు పోలీసు పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు మంత్రి లోకేశ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. దేశమంతా కలిసి చేసుకునే ఒకే ఒక్క పండుగ జెండా పండుగ అని, అది తనకు ఒక ఎమోషన్ అని అన్నారు. ఇండిపెండెన్స్ డే రోజు తనకు తన స్కూల్ డేస్ గుర్తొస్తాయని చెప్పారు.
ప్రపంచంలో ఒకే ఒక్క పవర్ ఫుల్ వెపన్ అహింస అని, ఆ వెపన్ మనకు ఇచ్చిన గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ అని అన్నారు. అహింస, సత్యం, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం అనే సిద్ధాంతాలతో స్వాత్రంత్య్రం సాధించిన మహోన్నత వ్యక్తి ఆయన అని కొనియాడారు. ప్రపంచంలో ఏ మార్పు రావాలని కోరుకుంటున్నావో ఆ మార్పు నీ నుండే మొదలవ్వాలని గాంధీజీ చెప్పిన మాటల స్పూర్తితో మార్పు మన నుండే మొదలుకావాలని కోరారు.
2019 నుండి 2024 వరకూ ఆంధ్రప్రదేశ్ లో చీకటి రోజులు చూశామని, గత ప్రభుత్వం ఐదేళ్ల లో 10 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళు వెనక్కి నెట్టిందని విమర్శించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తో రాష్ట్రం చీకటి నుండి వెలుగు వైపు తొలి అడుగు వేసిందని, ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవనన్న కలిసి సుపరిపాలనలో తొలిఅడుగు వేశారని అన్నారు.