పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్య లు చేశారు. ఒక్క బొట్టు రక్తం కూడా కారకుండా.. ఎన్నికలు నిర్వహించామని.. ఇది కూటమి ప్రభుత్వ విజ యమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం గెలిచిందని పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లోని ప్రజలు సం బరాలు చేసుకుంటున్నారని అన్నారు. అయితే.. ప్రభుత్వం చేస్తున్న మంచిని ఓ పార్టీ హర్షించలేక పోయిందని.. అడుగడుగునా.. కవ్వింపు చర్యలకు దిగిందని వైసీపీ పై విమర్శలు సంధించారు.
అయినప్పటికీ.. ప్రభుత్వం, పోలీసులు, ఎన్నికల అధికారులు, ఇతర సిబ్బంది కూడా చాలా సంయమ నంతో వ్యవహరించి ఎన్నికలను సజావుగా నిర్వహించారని తెలిపారు. దీంతో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. మూడు దశాబ్దాలుగా ఇక్కడ ఎన్నికలు జరగకుండా నామినేషన్లను తిరస్కరిస్తూ..నామినేషన్లు వేయాలని అనుకునేవారిని కూడా బెదిరింపులకు గురిచేస్తూ.. ఏకపక్షం చేసుకున్నారని.. కానీ, ఇప్పుడు తొలిసారి ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు జరిగాయని.. దీనిని కొందరు జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు.
పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికల్లో కూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థులు విజయం దక్కించుకోవ డం ప్రజాస్వామ్యానికి, నిన్నటి వరకు బందీలుగా ఉన్న ఆరెండు స్థానాల్లోని ప్రజలకు కూడా ఊపిరిలూ దిందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఉప పోరులో విజయం సాధించిన లతారెడ్డి, ముద్దుకృష్ణారెడ్డి లకు మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.
ఏకగ్రీవాలకు వెసులుబాటు ఉన్నా.. ప్రజాస్వామ్య బద్ధంగానే ఎన్నికలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నారని.. ఈ క్రమంలోనే ఎన్నికలు జరిగాయన్నారు. ఈ ప్రక్రియలో ఓ పార్టీ కవ్వింపు చర్యలకు దిగిందని.. అనేక దారుణాలకు ఒడిగట్టిందని అన్నారు. అయినా.. చుక్క రక్తం కారకుండా ఎన్నికలను సజావుగా, ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించిన అధికారులకు ధన్యవాదాలు చెబుతున్నానని పేర్కొన్నారు.