వైసీపీ దుర్మార్గాలను సాగనిచ్చేది లేదని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవ వేళ విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించిన సీఎం.. ఈ సందర్భంగా వైసీపీని ఉద్దేశించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు నాడు కునుకు లేకుండా చేసిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ ఎంతో మంది ప్రాణాలు తీసిందని.. దీంతో తాము రాగానే.. దుర్మార్గపు చట్టాన్ని తీసేశామని తెలిపారు. పేదలకు పట్టెడన్నం పెట్టని వైసీపీని ప్రజలు తరిమికొట్టారని అన్నారు.
తమ హయాంలో రూ.5కే అన్నం పెట్టి పొట్ట నింపే క్యాంటీన్లు తీసుకువస్తే.. వైసీపీ వచ్చాక.. పేదల పొట్ట కొట్టిందన్నారు. అందుకే.. కూటమి రాగానే తిరిగి క్యాంటీన్లను ప్రారంభించామని చెప్పారు. ఎస్సీలకు ఏనాడూ మంచి చేయని జగన్.. వారి వర్గీకరణను కూడా వ్యతిరేకించారని.. అందుకే తన హయాంలో రిజర్వేషన్ వ్యవహారాన్ని కూడా పట్టించుకోలేదన్నారు. కానీ, తాము అధికారంలోకి రాగానే.. ఎస్సీ సామాజిక వర్గాల్లో అంతరాలు తగ్గించేలా.. ఏ వర్గాన్నీ నొప్పించకుండా ఎస్సీ వర్గీకరణ చేశామని వివరించారు.
నాడు వైసీపీ మైనారిటీ ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగానే చూసిందన్న సీఎం చంద్రబాబు.. వారిని అగౌరవ పరిచేలా ఇమామ్‌లకు రూ.5000 మాత్రమే పింఛను ఇచ్చిందని.. కానీ, తాము 10 వేల రూపాయల కు పెంచామని చంద్రబాబు చెప్పారు. `భావ ప్రకటనా స్వేచ్చ` పేరుతో సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వైసీపీ నేతలను దారికి తెచ్చామన్న ఆయన.. ఇకపై కూడా ఇలానే వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. కుటుంబ సభ్యులు, మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
వైసీపీ హయాంలో సీమ ప్రాజెక్టులను గాలికి వదిలేశారన్న చంద్రబాబు.. తమ పాలనలో రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వేస్ట్ వాటర్‌ను పోలవరం నుంచి బనకచర్లకు మళ్లించాలని నిర్ణయిం చామని చెప్పారు. ఈ విషయంలో అందరినీ కలుపుకొని పోయి.. సాధిస్తామన్నారు. వైసీపీ హయాంలో దారు ణంగా తయారైన ఏపీ బ్రాండ్‌ను పునరుద్ధరిస్తున్నట్టు తెలిపారు. పారిశ్రామికవేత్తలకు నమ్మకాన్ని కలిగించి తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తున్నామని.. వైసీపీ దుర్మార్గాలపై పోరాటం కొనసాగుతుందని చెప్పారు.