ఏపీలో 2019-24 మధ్య కొనసాగిన వైసీపీ పాలనపై ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్య లు చేశారు. ``వైసీపీ వారిది.. బ్రిటీష్ పాలన. ఇంకా చెప్పాలంటే.. చీకటి రాజ్యం`` అని అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను ఇనుప సంకెళ్లతో బంధించారని, ఎవరినీ గొంతు ఎత్తనివ్వలేదని వ్యాఖ్యానించారు. ఎవరైనా సాహసించి మాట్లాడితే.. వారిని, వారి బంధువులను కూడా ఇబ్బందులు పెట్టారని, అరెస్టు చేశారని తెలిపారు. అవినీతి విచ్చల విడిగా సాగిందని పవన్ చెప్పారు.
తాజాగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడలో నిర్వహించిన కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడు తూ.. కూటమి ప్రభుత్వం ఎందుకు ఏర్పడిందో చెప్పుకొచ్చారు. ఇప్పటి ప్రజలు బ్రిటీష్ పాలనను పుస్తకాల్లోనే చదువుకున్నారని.. కానీ, దీనిని చేతల్లోకి వైసీపీ తీసుకువచ్చిందన్నారు. నాటి పాలన చీకటి రాజ్యాన్ని, నియంతృత్వ రాజ్యాన్ని తలపించిందన్నారు. అందుకే.. కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని తెలిపారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారని పవన్ కల్యాణ్ చెప్పారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేస్తున్నామని.. ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేశామని చెప్పారు. శుక్రవారం ఉచిత బస్సును ప్రారంభిస్తున్నామని.. ఇది మహిళలకు ఇచ్చే గౌరవమని తెలిపారు. 2019 నుంచి 24 మధ్య ప్రజలు అనేక కష్టాలు పడ్డారని, నేను కూడా బాధితుడినేనని పవన్ వ్యాఖ్యానించా రు. పెట్టుబడులు వస్తున్నాయని.. ఉపాధి ఉద్యోగాలు మెండుగా దక్కుతాయని యువతకు చెప్పారు.
రాహుల్‌పై విమర్శలు..
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌పై విమర్శలు గుప్పించారు. ``ఓట్ చోరీ అంటు న్నారు. మీరు గెలిస్తే.. ఒకన్యాయం. ఓడిపోతే మరో న్యాయమా?`` అని ప్రశ్నించారు. ఓట్ చోరీ అనేది జరిగి ఉంటే.. మీరు గెలిచిన రాష్ట్రాలలో ఎలా సాధ్యమైందని కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. దేశంలో ఏదో అలజడి సృష్టించాలన్న ఉద్దేశంతోనే ఈ అంశాన్ని ఎంచుకున్నట్టు కనిపిస్తోందన్నారు.