పులివెందుల జడ్పీటీసీ ఉప పోరులో వైసీపీ చేతులు ఎత్తేసిన విషయం తెలిసిందే. ఆ పార్టీ అభ్యర్థి హేమంత్ కుమార్ రెడ్డికి కేవలం 435 ఓట్లు పడ్డాయి. దీంతో ఆయన డిపాజిట్ కోల్పోయారు. ఈ బాధ ఇలా ఉంటే.. మరోవైపు, ఇదే పరిధిలో ఈవీఎం మిషన్‌లోని నోటాకు 11 ఓట్లు పడ్డాయి. దీంతో ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో వైసీపీకి చేదు అనుభవం ఎదురైంది. సోషల్ మీడియాలో దూకుడుగా ఉన్న వైసీపీకి.. ఈ 11 పెద్ద చిక్కు తీసుకువచ్చింది.
`11-వైసీపీకి కలిసి వచ్చిన సంఖ్య` అంటూ మెజారిటీ నెటిజన్లు కామెంట్ చేశారు. వాస్తవానికి నోటాకు ఇన్ని ఓట్లు పడతాయని అనుకోలేదు.. అని మరికొందరు వ్యాఖ్యానించారు. ``సార్వత్రిక ఎన్నికలు జరిగి ఏడాది న్నర అయినా.. వైసీపీని ప్రజలు మరిచిపోలేదు`` అని మరొకరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కాయి. ఈ వ్యవహారాన్ని గుర్తు చేస్తూ.. పులివెందుల ప్రజలు కూడా వైసీపీకి మంచి లెస్సన్ చెప్పారని ఇంకొందరు చెప్పుకొచ్చారు.
ఇదిలావుంటే.. పులివెందులలో కాంగ్రెస్ అభ్యర్థికి 102 ఓట్లు పడ్డాయి. అయితే.. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రచారం చేయలేదు. పైగా షర్మిల అసలు పులివెందులను పట్టించుకోలేదు. అయినా.. 102 ఓట్లు పడడం గమనార్హం. అదేవిధంగా వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు ఒకరు పోటీ చేయగా.. ఆయన ఫ్యామిలీలో ఉన్న ఆరుగురు కూడా ఓటేయలేదు. కేవలం ఇద్దరు మాత్రమే ఓటేశారు. వారిలో ఒకరు పోటీ లో ఉన్న అభ్యర్థేకావడం గమనార్హం. మొత్తానికి ఇవి ఎలా ఉన్నా.. నోటా ఓట్లపై మాత్రం వైసీపీకి మరోసారి 11 గుర్తుకు వచ్చేలా చేసిందని అంటున్నారు పరిశీలకులు.