పులివెందుల.. వైసీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గం. ఇక్కడ జరిగిన జడ్పీ టీసీ ఉప ఎన్నికలో వైసీపీ ఘోర పరాజయం చవిచూసింది. కనీసం... అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కలేదు. ఈ పరిణామంతో ఇక... వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా పోయినట్టే అనే భావనలో టీడీపీ నాయకులు ఉన్నారు. జనసేన కూడా దాదాపు ఇదే భావనతో ఉంది. కానీ, బీజేపీ టాక్ వేరేగా వినిపిస్తోంది. ఒకరిద్దరు బీజేపీ నాయకులు.. మాత్రం ఈ విషయంలో వైసీపీ వైపు మాట్లాడుతున్నారు. పులివెందుల ఓడినా.. వైసీపీ హవా తగ్గలేదని చెబుతున్నారు.
వారి మాట ఎలా ఉన్నా.. రాష్ట్ర వ్యాప్తంగా పులివెందుల ప్రభావం ఎంత? అనే విషయంపై వైసీపీ కూడా ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలోనే ఇక్కడ గెలుపు కోసం.. టీడీపీ అనుసరించిన విధానాలపై జగన్ సహా నాయకులు ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ దాదాపు ఇదే ప్రచారం చేస్తున్నారు. అంటే.. ఒకరకంగా.. పులివెందులలో తాము ఓడిపోయినా.. సింపతీని దక్కించుకునేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాము బలంలేక ఓడిపోలేదన్న వాదనను ప్రజలకు వినిపించేలా చేస్తున్నారు.
మరోవైపు.. ఒక్క ఓటమితోనే ఏ పార్టీకి సంబంధించిన రాజకీయ భవితవ్యాన్ని అంచనా వేయలేమని పరిశీ లకులు కూడా చెబుతున్నారు. సహజంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీది పైచేయి అవుతుంది. ఈ నేపథ్యంలోనే జడ్పీటీసీ ఉప పోరును చూడాలని అంటున్నారు. పులివెందుల, ఒంటిమి ట్టల్లో జరిగిన ఉప పోరును ఆ కోణంలోనే చూస్తున్నారు తప్ప.. పూర్తిస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీపై ప్రభావం పడుతుందని అనేవారు చాలా వరకు తక్కువగానే ఉన్నారు. వీరంతా తటస్థులు. అయితే.. టీడీపీ మాత్రం రాష్ట్రస్థాయిలో వైసీపీ పరువు పోయిందని ప్రచారం చేస్తోంది.
ఉదాహరణకు.. గత 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ లేదు. అసలు పోటీ నుంచే తప్పుకుం టున్నామని.. చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. అయినా.. కొందరు పోటీ చేసి.. గెలిచిన వారు గెలిచా రు. అప్పట్లో వైసీపీ ఏకగ్రీవాలు చేసుకుంది. కానీ, తర్వాత నాలుగేళ్లకు వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పుంజుకుందా? అంటే లేదు. సో.. ఏదైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం లేదా పరాజయం సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపించదన్నది తెలుస్తునే ఉంది. కాబట్టి.. పులివెందుల పరాజయంతోనే వైసీపీ పని అయిపోయిందా? లేదా? అనేది వచ్చే ఎన్నికల్లో తేలుతుంది.