దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. గల్లీలో సర్పంచ్ మొదలు ఢిల్లీలో ప్రధాని మోదీ వరకు అందరూ జాతీయ జెండాను ఎగుర వేశారు. కానీ, ఏపీ మాజీ సీఎం జగన్ మాత్రం జాతీయ జెండాను ఎగురవేయలేదు. కేవలం స్వాతంత్ర్య దినోత్సవం గురించి ఒక ట్వీట్ పెట్టి చేతులు దులుపుకున్నారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికల ఓటమి బాధతో ఉన్న జగన్ జాతీయ జెండా ఎగురవేయలేదని విమర్శలు వస్తున్నాయి. సీఎం అయితేనే జగన్ ఫ్టాగ్ హోస్టింగ్ చేస్తారా అని ట్రోలింగ్ జరుతోంది. ఈ క్రమంలోనే జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు.
జగన్ కు ఎందుకంత అహంకారమని సోమిరెడ్డి ప్రశ్నించారు. లక్షలాది మంది ప్రాణత్యాగం వల్ల స్వాతంత్ర్యం వచ్చిందని, ఆ రోజు జగన్ కు గుర్తు లేదా అని నిలదీశారు. ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక మాజీ సీఎం అన్న విషయం జగన్ కు గుర్తుందా అని ప్రశ్నించారు. పులివెందుల ఎన్నిక ఫలితంతో అసహనంగా ఉన్నంత మాత్రాన జాతీయ జెండా ఎగురవేయరా అని అడిగారు. జగన్ రాజకీయ జీవితంలో ఇదొక బ్లాక్ మార్క్ అని విమర్శించారు.
కాగా, తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో సజ్జల జాతీయ జెండా ఎగురవేసి మమ అనిపించారు. జగన్ జాతీయ జెండా ఎగరేసి తమకు సందేశం ఇస్తారని భావించిన వైసీపీ కార్యకర్తలు కూడా జగన్ రాకపోవడంతో షాకయ్యారట.