ఆగస్టు 15 నుంచి ఏపీలోని మహిళలకు నిర్దేశించిన ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటును 'స్త్రీ శక్తి' పథకం ద్వారా ప్రభుత్వం కల్పించిన సంగతి తెలిసిందే. అయితే, సూపర్ సిక్స్ హామీలు అమలవుతున్న తీరును చూసి ఓర్వలేక ఈ పథకంపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలపై టీడీపీ నాయకురాలు, రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్‌పర్సన్ పీతల సుజాత మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలు వైసీపీ నేతల దిగజారుడుతనానికి నిదర్శనమని ఆమె అన్నారు.
ఆడపడుచులను అభివృద్ధి పథంలో నడిపించాలన్నది టీడీపీ సిద్ధాంతమని, అన్న ఎన్టీఆర్ మహిళల హక్కుల కోసం ఎన్నో సంస్కరణలు తెచ్చారని గుర్తు చేశారు. ఆ స్ఫూర్తితోనే సీఎం చంద్రబాబు డ్వాక్రా సంఘాలకు బీజం వేశారని, కోటి మంది మహిళలు ఆ సంఘాల ద్వారా తమ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. రాఖీ పండుగలా ఈ పథకాన్ని కూడా మహిళలు చిరకాలం గుర్తుంచుకుంటారని అన్నారు. ఈ పథకంపై వైసీపీ నేతల దుష్ప్రచారం సరికాదని హితవు పలికారు. కావాలంటే పులివెందుల నుంచి వైఎస్ భారతి కూడా బస్సులో ఉచితంగా అమరావతికి ప్రయాణం చేయవచ్చని చురకలంటించారు.