ఏపీ నుంచి ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లే యువతకు సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డాటా సిటీ ఏర్పాటుకు కేంద్ర సహకారం అందించాలని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌కు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో ఈ రోజు కేంద్ర విదేశాంగశాఖ మంత్రితో లోకేశ్ భేటీ అయ్యారు.
ఈ భేటీపై జై శంకర్ కూడా తన ఎక్స్ ఖాతాలో స్పందించారు. ఈ రోజు ఉదయం లోకేశ్ తో భేటీ అయ్యానని ఆయన అన్నారు. ఆ భేటీపై హర్షం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధికి, పురోగతికి కేంద్రం తమ వంతుగా పూర్తి మద్దతునిస్తుందని చెప్పారు.
జై శంకర్ తో భేటీపై లోకేశ్ స్పందించారు. రాష్ట్రాభివృద్ధి కోసం పలు విషయాలపై చర్చించామని, వాటిపై జై శంకర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. విశాఖపట్నంలో డేటా సిటీ అభివృద్ధికి సహకారం కావాలని కోరానని అన్నారు. ప్రవాస భారతీయ బీమా యోజన పథకాల విస్తరణ, సంబంధిత ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏపీలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయి స్కిల్ కాంక్లేవ్ నిర్వహణలో ఏపీకి భాగస్వామ్యం కల్పించినందుకు జై శంకర్ కు కృతజ్ఞతలు తెలిపానని అన్నారు. వలస కార్మికులకు ఓవర్సీస్ ట్రైనింగ్, మైగ్రేషన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కోసం ఫాస్ట్ ట్రాక్ అనుమతులు, నిధులు మంజూరు చేయాలని కోరానని అన్నారు.
ఏపీకి చెందిన సుమారు 35 లక్షల మంది ప్రవాసాంధ్రులు విదేశాల్లో ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నారని, అమెరికాలో 10 లక్షలు, గల్ఫ్ దేశాల్లో 8 లక్షలు, ఐరోపా దేశాల్లో 4 లక్షల మంది ప్రవాసాంధ్రులు ఉన్నారని జై శంకర్ కు లోకేశ్ వివరించారు. యూఎస్ లో అక్కడి ప్రజల తలసరి ఆదాయం 70 వేల డాలర్లు కాగా, ప్రవాసాంధ్రుల తలసరి ఆదాయం 1,26,000 డాలర్లుగా ఉందని తెలిపారు.
నైపుణ్యం కలిగిన యువతకు విదేశాల్లో ఉద్యోగావకాశాలను కల్పించడానికి, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్జానాన్ని రప్పించడానికి జపాన్, కొరియా, తైవాన్లతో కలసి మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్టనర్ షిప్ అరేంజ్ మెంట్ (MMPA) ఉమ్మడి ప్రాజెక్టుల ఏర్పాటుపై దృష్టి సారించామని వివరించారు. ఏపీ యువతకు మెరుగైన విదేశీ ఉద్యోగావకాశాల కల్పనకు కేంద్రం నుంచి రాష్ట్రానికి డేటా షేరింగ్ సహకారాన్ని అందించాలని జై శంకర్ కు లోకేశ్ విజ్ఞప్తి చేశారు.