తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిల మధ్య వైరం సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత ఎన్నికల సమయంలో జరిగిన ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలు తారస్థాయికి చేరాయి. దీంతో, 14 నెలలుగా తాడిపత్రికి రాకుండా పెద్దారెడ్డి ఉంటున్నారు. చివరకు హైకోర్టు అనుమతినివ్వడంతో నేడు ఆయన తాడిపత్రికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, పెద్దిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.
హైకోర్టు ఆదేశాలు, షరతుల ప్రకారం కేతిరెడ్డి పెద్దారెడ్డి పోలీసు భద్రత మధ్య తాడిపత్రిలోకి ఎంటరయ్యేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి చేపట్టారు. దీంతో, తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో, ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ, తాము కార్యక్రమం నిర్వహించి తీరుతామని జేసీ వర్గీయులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య నలిగిపోతున్న పోలీసులు చివరకు కోర్టును ఆశ్రయించారు. పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించవద్దని హైకోర్టులో పోలీసులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై కోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.