రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు పెద్ద కోడలు, నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ(62) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పద్మజ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు.
మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు పద్మజ స్వయానా సోదరి అవుతారు. అలాగే సినీ నటుడు నందమూరి చైతన్య కృష్ణకు తల్లి. పద్మజ మరణంతో ఇటు నందమూరి కుటుంబంతో పాటు అటు దగ్గుబాటి ఫ్యామిలీలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు ఒక్కొక్కరిగా జయకృష్ణ నివాసానికి చేరుకుంటున్నారు. విషయం తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం హైద్రాబాద్ కి బయల్దేరారు.
పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పద్మజ మరణంపై సంతాపం తెలుపుతున్నారు. బుధవారం పద్మజ అంత్యక్రియలు నిర్వహించనున్నారని తెలుస్తోంది. కాగా, సీనియర్ ఎన్టీఆర్ కు జయకృష్ణ రెండో కుమారుడు. ఈయన ప్రొడ్యూసర్ గా సినీ పరిశ్రమకు కొంతకాలం దగ్గరగా ఉన్నప్పటికీ, ఎక్కువగా వ్యాపార రంగంలోనే చురుకుగా వ్యవహరించారు.