వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బధువారం ఉదయం విడుదల అయ్యారు. సుమారు 86 రోజుల పాటు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న కాకాణికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అక్రమంగా క్వార్ట్జ్ తవ్వకాలు, వాటి అక్రమ రవాణా, ఇంకా నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వాడకం వంటి ప్రత్యక్ష ఆరోపణలు కాకాణిపై ఉన్నాయి. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల కేసుతో సహా మొత్తం ఎనిమిది కేసులు నమోదు కాగా.. మే 25వ తేదీన బెంగళూరులోని ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో ఏపీ పోలీసులు కాకాణిని అరెస్ట్ చేశారు.
మే 26న వెంకటగిరి కోర్టు ఆయనను 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్‌కు పంపింది. అయితే తాజాగా అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో కాకాణి గోవర్ధన్ రెడ్డి నేడు రిలీజ్ అయ్యారు. ఆయనకు జైలు వద్ద కాకాణి పూజిత, ఎమ్మెల్సీలు మురళీ, చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఇతర వైసీపీ నేతలు, అనుచరులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన అరెస్ట్‌పై కాకాణి తొలిసారి మీడియా ముందు రియాక్ట్ అవుతూ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
కూటమి ప్రభుత్వం తనపై చిత్రవిచిత్రమైన కేసులు బనాయించిందని.. తన అరెస్టు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యేనని కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు సోషల్ మీడియాలో దారుణంగా విమర్శించిన వారిపై ఒక్క కేసు కూడా పెట్టలేదు.. కానీ తనపై ఏకంగా ఆరు సోషల్ మీడియా కేసులు పెట్టారని కాకాణి ఫైర్ అయ్యారు. ఏడు పీటీ వారెంట్ లు వేశారని.. కానీ జైళ్లు, కేసులకు తాను భయపడేది లేదని, ప్రజా వ్యతిరేక విధానాలపై తన పోరాటమూ ఆగదని కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా ప్రజలు, సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలే నా ఆస్తి అన్నారు. టీడీపీ నేతలు చేసే దోపిడీపై కచ్చితంగా భవిష్యత్తులో విచారణ ఉంటుందని కాకాణి హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా కష్టకాలంలో తనను పరామర్శించేందుకు వచ్చిన పార్టీ అధినేత జగన్‌కు ప్రత్యేకంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు.