ప్రజా జీవితంలో ఉన్న నాయకులు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న ఉదంతాలు ఇప్పుడు షాకింగ్ గా ఉంటున్నాయి. తాజాగా శ్రీశైలం ఎమ్మెల్యే.. టీడీపీ సీనియర్ నేతగా పేరున్న బుడ్డా రాజశేఖర్ రెడ్డి వ్యవహరించిన తీరును పలువురు తప్పుపడుతున్నారు. తప్పతాగి మద్యం మత్తులో ఆయన క్రియేట్ చేసిన చర్చ జిల్లా వ్యాప్తంగానే కాదు.. ఏపీ అధికారపక్షానికి కొత్త తలనొప్పిగా మారినట్లు చెబుతున్నారు.
మద్యం తాగటం ఒక ఎత్తు.. అనంతరం రచ్చ చేయటం మరో ఎత్తు. మద్యం సేవించి పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలం గెస్టు హౌస్ లో ఆయన ప్రదర్శించిన అతిని పలువురు తప్పు పడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పులు.. ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు ప్రత్యక్షసాక్ష్యులు.. రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. రాత్రి వేళలో ఫుల్ గా మద్యం సేవించిన ఎమ్మెల్యే బుడ్డా తన అనుచరులతో చిన్నారుట్ల బీట్ సమీపంలో వాహనాల్ని నిలిపి ఉంచినట్లుగా తెలుస్తోంది.
డోర్నాల - శ్రీశైలం ఘాట్ రోడ్డును రాత్రి 9 గంటలకు మూసి.. ఉదయం 6 గంటలకు తెరుస్తారన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యలో అటవీ అధికారులు గస్తీ చేపడుతూ ఉంటారు. అదే విధంగా గస్తీ చేపట్టిన వేళలో.. చిన్నారుట్ల చెక్ పోస్టు దగ్గర రెండు వాహనాలు రోడ్డు మీద ఆగి ఉన్న వైనాన్ని గుర్తించిన సిబ్బంది హారన్ కొడుతూ వాటి వద్దకు వెళ్లారు.అక్కడకు వెళ్లినప్పుడు.. వాహనంలో శ్రీశైలం ఎమ్మెల్యే ఉండటాన్ని చూసి ఆయనకు సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా అటవీ సిబ్బంది మీద వస్తున్న ఆరోపణలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే..ఆయన అనుచరుల వాహనాల్ని శ్రీశైలంకు వెళ్లేందుకు సిద్దం కావటంతో.. నిబంధనలు గుర్తు చేసే ప్రయత్నం చేశారు. టైగర్ జోన్ లో వాహనాల్ని రాత్రి వేళలో అనుమతించకూడదని చెబుతున్నా.. ఒప్పుకోని ఎమ్మెల్యే అటవీ సిబ్బంది ఐడీ.. ఆధార్ కార్డులు.. పర్సులను ఎమ్మెల్యే అనుచరులు లాగేసినట్లుగా చెబుతున్నారు అంతేకాదు.. అడ్డుకున్న అటవీ అధికారులను తమ వాహనాల్లో బలవంతంగా కూర్చోబెట్టుకొని శ్రీశైలంలోని గెస్టు హౌస్ లో నిర్బంధించినట్లుగా సమాచారం.
అక్కడకు జనసేన నేత కూడా చేరుకున్నట్లు చెబుతున్నారు. ఈ అంశాన్ని అటవీ శాఖా మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఎలా చెప్పాలన్నది అటవీ శాఖ అధికారులకు సమస్యగా మారింది. అయితే.. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావటం.. ప్రభుత్వ పెద్దల సూచనలో శ్రీశైలం వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో అటవీ శాఖ అధికారులు కంప్లైంట్ చేశారు. దీంతో.. టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి.. జనసేన నేత అశోక్ పై కేసులు నమోదు చేశారు మద్యం సేవించి పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఎమ్మెల్యే ఎలా బస చేస్తారన్నది ప్రశ్నగా మారింది.దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.