ప్రధాని మోదీ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సందర్భానుసారంగా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ ఇద్దరినీ ముడిపెడుతూ ప్రకాష్ రాజ్ తన ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఏపీలో ముఖ్యమంత్రిని మార్చబోతున్నారా అంటూ మోదీని ప్రకాష్ రాజ్ చిలిపిగా ప్రశ్నించిన వైనం హాట్ టాపిక్ గా మారింది.
తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటూ 30 రోజులు జైలు శిక్ష అనుభవించిన మంత్రులను పదవీచ్యుతులుగా చేసి బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ బిల్లు పాసైతే కేంద్ర ప్రభుత్వం తనకు నచ్చని ముఖ్యమంత్రులను, విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రలను టార్గెట్ చేసే చాన్స్ ఉందని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ రాజకీయాలను ఉద్దేశించి ప్రకాష్ రాజ్ పరోక్షంగా పెట్టిన ఆ పోస్ట్ వైరల్ గా మారింది.
‘ఒక చిలిపి సందేహం.. మహాప్రభు.. తమరు కొత్తగా ప్రవేశపెడుతున్న బిల్లు వెనుక, మాజీ ముఖ్యమంత్రి కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ తమ మాట వినకపోతే అరెస్టు చేసి, “మీ మాట వినె ఉపముఖ్యమంత్రిని” ముఖ్యమంత్రి చేసే కుట్ర ఏమైనా ఉందా ???’ అంటూ ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. అయితే, ఏపీని ఉద్దేశించి ప్రకాష్ రాజ్ ఇలా వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు అనుకుంటున్నారు. ఆ బిల్లుతో చంద్రబాబుకు మోదీ హెచ్చరిక జారీ చేశారా? అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. పరోక్షంగా పవన్ ను ప్రకాష్ రాజ్ ఎలివేట్ చేశారని గుసగుసలాడుకుంటున్నారు.