ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఓవైపు రాష్ట్రంలో పాలన సాగిస్తూనే మరోవైపు ఎమ్మెల్యేలు మరియు మంత్రుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. నివేదికలు తెప్పించుకుంటూ మంత్రులు, ఎమ్మెల్యేలకు అవసరమైన సలహా, సూచనలు ఇస్తున్నారు. అడ్డగోలుగా వ్యవహరిస్తున్న ప్రజాప్రతినిధులకు గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా ఫైల్ క్లియరెన్స్ ఆధారంగా ఏపీ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ర్యాంకులు ఇచ్చారు.
ఈ జాబితాలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఫస్ట్ ప్లేస్‌ను కైవశం చేసుకున్నారు. రెండో స్థానంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఉండగా.. ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మూడో స్థానంలో నిలిచారు. హోంమంత్రి అనిత నాలుగో స్థానాన్ని, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఐదో స్థానాన్ని సొంతం చేసుకున్నారు.
మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ చివరి స్థానాల్లో ఉన్నారు. కేవలం ఫైల్ క్లియరెన్స్ ఆధారంగా ఈ ర్యాంకులు ఇవ్వడం జరిగింది. నియోజకవర్గంలో మంత్రులు ఎంత ప్రభావం చూపుతున్నారు, ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా ఏ మేరకు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, తమ శాఖలపై ఎంత పట్టు సాధించారు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని రాబోయే కేబినెట్ సమావేశంలో మంత్రుల సమగ్ర పనితీరుపై కూడా ర్యాంకులు ఇవ్వడం జరుగుతుందని తాజాగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.