బాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన గోవిందా.. తన భార్య సునీత ఆహుజా నుంచి విడిపోతున్నట్లుగా గత ఏడాది గట్టిగా ప్రచారం జరిగింది. సునీత విడాకుల కేసు కూడా ఫైల్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ తర్వాత ఇద్దరూ కలిసిపోయారు. ఇక కథ సుఖాంతం అని అందరూ అనుకుంటే.. ఇప్పుడు మళ్లీ వీరి విడాకుల వ్యవహారం తెరపైకి వచ్చింది.
గోవిందా నుంచి విడిపోవడానికి సునీత నిర్ణయించుకున్నారని... భర్త మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ విడాకుల కేసు ఫైల్ చేశారని నిన్నట్నుంచి మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. గోవిందా మోసగాడని, అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడని.. తనపై గృహ హింసకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించినట్లు బాలీవుడ్ మీడియా రిపోర్ట్ చేసింది. గోవిందాతో ఇక కలిసి ఉండడం సాధ్యం కాదని.. 37 ఏళ్ల వైవాహిక బంధానికి తెరదించాలనే ఆమె నిర్ణయించుకున్నారని ఈ కథనాల్లో పేర్కొన్నారు.
కట్ చేస్తే ఈ వార్తలన్నీ నిరాధారం అంటూ గోవిందా లాయర్ లలిత్ బింద్రా తేల్చేశాడు. గోవిందాకు వ్యతిరేకంగా సునీత ఎలాంటి కేసు ఫైల్ చేసినట్లు తమ దృష్టికి రాలేదని అతను స్పష్టం చేశాడు. కొందరు పాత విషయాలను తెరపైకి తెచ్చి ప్రచారం చేస్తున్నారని.. త్వరలోనే వినాయక చవితి వస్తుందని.. అప్పుడు ఈ ఇద్దరినీ కలిసి జంటగా చూడొచ్చని లలిత్ తెలిపాడు.
ఐతే తాను, గోవిందా విడిగా ఉంటున్నట్లు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో స్వయంగా సునీతనే వెల్లడించారు. కానీ అంతమాత్రాన తాము విడిపోయినట్లు కాదన్నారు. గోవిందా రాజకీయాల్లో ఉండడం వల్ల ఆయన్ని కలవడానికి రకరకాల వ్యక్తులు ఇంటికి వస్తుంటారని.. అందు వల్ల తమ కూతురు ఇబ్బంది పడుతోందని.. అందుకే తాము వేర్వేరు ఇళ్ళలో ఉంటున్నామని ఆమె చెప్పారు. మరి విడాకుల వార్తల గురించి ఇప్పుడు సునీత ఎలా స్పందిస్తుందో చూడాలి.