ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అద్భుతమైన పాలన అందించడం జీర్ణించుకోలేక వైసీపీ నేతలు ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ సొంత పత్రిక, ఛానెల్ సాక్షితో పాటు బ్లూ మీడియా ద్వారా చంద్రబాబు ప్రభుత్వంపై విష ప్రచారం జరుగుతోందని వారు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. విష ప్రచారాలు చేసేందుకు తనకు, పవన్ కల్యాణ్ కు సొంత ఛానెళ్లు లేవని చంద్రబాబు అన్నారు.
టీడీపీ, బీజేపీ, జనసేనలకు సొంత ఛానెళ్లు లేవని చెప్పారు. ఈ రాష్ట్రంలో జగన్ కు తప్ప ఏ రాజకీయ నాయకుడికి సొంత ఛానెల్ ఉందని ప్రశ్నించారు. తప్పుడు వార్తలు వేయడానికి పేపర్, టీవీ పెట్టుకున్నాడని జగన్ పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఆడబిడ్డలపై సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు ఇష్టం వచ్చినట్లు తప్పుడు పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటివారిని ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.