ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా చిరుకు సంబంధించిన పోస్టులే కనిపిస్తున్నాయి. చిరు మీద అభిమానాన్ని ఎవరి స్థాయిలో వాళ్లు అద్భుతంగా ప్రెజెంట్ చేస్తున్నారు. ఆయన వీరాభిమానుల పోస్టులు చూస్తే ఒక సినిమా హీరో మీద ఇంతటి అభిమానం ఉంటుందా అని ఆశ్చర్యం కలగక మానదు. ఇంతటి అభిమానం సంపాదించుకున్న చిరు ధన్యుడు అనిపిస్తుంది. సెలబ్రెటీల నుంచి సామాన్యుల దాకా చిరు పుట్టిన రోజు పోస్టులతో సోషల్ మీడియాను ముంచెత్తారు.
సెలబ్రెటీల్లోనూ పెద్ద ఎత్తున అభిమానులున్న అరుదైన హీరో చిరంజీవి. ఐతే శుక్రవారం ఎన్నో అద్భుతమైన పోస్టులు ఉన్నాయి కానీ.. వాటిలో యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పోస్టు చాలా స్పెషల్ అనే చెప్పాలి. చిరుకు విషెస్ చెబుతూ ఒక సెల్ఫీ ఫొటోను అతను పోస్టు చేశాడు. ఈ క్రమంలో చిరుపై తన అభిమానాన్ని చాటుకుంటూ.. ఆయనతో తాను తీయబోయే సినిమా గురించి అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ పెంచుతూ తన పోస్టు సాగింది. గుండె లోతుల్లోంచి వచ్చిన మాటల్లా అనిపించాయి తన మాటలు. ఇంతకీ తన పోస్టులో శ్రీకాంత్ ఏమన్నాడంటే..
నువ్వు నా డెమీ గాడ్. చిరంజీవితో ఒక ఫొటో దిగి ఇంట్లో అమ్మకు చూపెడితే.. ఫస్ట్ టైం నువ్వు ఫొటోలో నవ్వడం చూస్తున్నా అని చెప్పింది. చిరంజీవికి నా నిర్వచనం ఇది. ఏం చేస్తాడు చిరంజీవి అంటే.. నా లాంటి ఇంట్రావర్ట్ గాడితో ఇంద్ర స్టెప్ చేయించగలడు. సినిమా టికెట్లు కొనేవాడితో సినిమా తీయించగలడు. నీయమ్మా.. జీవిత కాలం ఆడే సినిమా రా చిరంజీవి. ఇప్పుడు చిరంజీవితో సినిమా అంటే జీవిత కాలం గుర్తుండిపోయేలా తీయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు.
ఇక చివరగా ఒక మాట.. నేను నా చిరంజీవిని స్క్రీన్ మీద మిస్ అవుతున్నా. నేను హామీ ఇస్తున్నా ఆ చిరంజీవిని మళ్లీ వెనక్కి తీసుకొస్తా. నా కోసం నేనే తీస్తున్న సినిమా ఇది. నా లాంటి ప్రతి చిరంజీవి అభిమాని కోసం తీస్తున్న సినిమా #చిరుఓదెల. ఇది బ్లడ్ ప్రామిస్. హ్యాపీ బర్త్ డే ట్రెక్స్ మెగాస్టార్ చిరంజీవి. ఫొటో తీసేటపుడు హ్యాండ్ షేక్ అయి ఫొటో బ్లర్ వచ్చింది. ఏమీ అనుకోకండి అంటూ ముగించాడు శ్రీకాంత్ ఓదెల. నాని ప్రెజెంటర్‌గా వ్యవహరించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్ మీదికి వెళ్లొచ్చు.