ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ నేడు వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. జై జై జై గణేశ జై జై జై జై.....అంటూ బొజ్జ గణపయ్యను రకరకాల రూపాలలో పూజిస్తున్నారు. తమ జీవితంలో విఘ్నాలు తొలగిపోవాలని వినాయకుడికి పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరు తెలుగు రాష్ట్రాలలోని తెలుగు ప్రజలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఏపీ సీఎం చంద్రబాబు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రజలు తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను ఏ ఆటంకాలు లేకుండా చేరుకోవాలని చంద్రబాబు మనస్పూర్తిగా కోరుకున్నారు. ప్రతి కుటుంబం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ఆ గణనాథుడి అనుగ్రహం అందరిపై ఉండాలని చంద్రబాబు ప్రార్థించారు. వాడవాడలా వినాయక మండపాలు ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో గణేషుడిని పూజిస్తున్న భక్తులకు సకల శుభాలు కలగాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
వినాయక చవితి పర్వదినం సందర్భంగా ప్రజలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. హైందవ పండుగలలో కొన్నింటిని కొన్ని ప్రాంతాల్లోనే నిర్వహించుకుంటారని, కానీ వినాయక చవితిని ప్రపంచంలోని హిందువులంతా ఒక్కటిగా జరుపుకుంటారని అన్నారు. ప్రజలు తలపెట్టే అన్ని శుభ కార్యక్రమాలకు విఘ్నాలు కలగకుండా చూడాలని ఆ పార్వతీ తనయుడిని వేడుకుంటున్నానని చెప్పారు. మట్టి వినాయకుడిని పూజించాలని, పర్యావరణాన్ని కాపాడాలని పవన్ పిలుపునిచ్చారు.
అదే విధంగా, ప్రజలందరికీ మంత్రి నారా లోకేశ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయకుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని, సత్కార్యాలన్నీ ఆటంకాలు లేకుండా విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.