ఒక సినిమాలో కథానాయికగా నటిస్తే.. ప్రమోషన్లకు కూడా రావాల్సిందే. తాము నటించిన సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు తోడ్పడడం ఆర్టిస్టుల బాధ్యత. అందులో హీరో హీరోయిన్లకు ఎక్కువ బాధ్యత ఉంటుంది. సిఇమాకు వాళ్లే కీలకం కాబట్టి ప్రమోషన్లలో వాళ్లు ముఖ్య పాత్ర పోషించాల్సిందే. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం ప్రమోషన్లకు దూరంగా ఉంటారు. అందులో నయనతార ఒకరు. కానీ ఈ మధ్య సెలక్టివ్‌గా కొన్ని సినిమాలను ఆమె ప్రమోట్ చేస్తోంది.
మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటిస్తున్న మన శంకర వరప్రసాద్ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోలో ఆమె కనిపించి ఆశ్చర్యపరిచింది. మరి సినిమా రిలీజ్ ముంగిట కూడా ప్రమోషన్లలో ఆమె పాల్గొంటుందేమో చూడాలి. సౌత్ ఇండియాలో ఈ మధ్య తమ సినిమాలను ప్రమోట్ చేయని హీరోయిన్ల జాబితాలో అనుష్క శెట్టి కూడా చేరుతోంది. తన చివరి సినిమా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిని ఆమె ప్రమోట్ చేయలేదు. అంతకుముందు నిశ్శబ్దం ప్రమోషన్లకూ ఆమె దూరంగా ఉంది.
ఇప్పుడు అనుష్క తన కొత్త చిత్రం ఘాటి ప్రమోషన్లలో అయినా పాల్గొంటుందేమో అని అభిమానులు ఆశించారు. కానీ అది జరగదని నిర్మాత రాజీవ్ రెడ్డి స్పష్టం చేశారు. తాను ప్రమోషన్లలో పాల్గొననంటూ అగ్రిమెంట్లోనే అనుష్క స్పష్టంగా పేర్కొన్నట్లు ఆయన వెల్లడించారు. ఆమె నిర్ణయాన్ని తాము గౌరవిస్తామన్నారు. ఐతే అనుష్కకు నిర్మాతల హీరోయిన్‌గా పేరుంది. తనకు వీలు దొరక్క, ఇష్టం లేక ప్రమోషన్లకు దూరంగా ఉండడం లాంటిదేమీ ఉండదని, దీనికి వేరే కారణం ఉండొచ్చని భావిస్తున్నారు.
సైజ్ జీరో కోసం అసాధారణంగా బరువు పెరిగిన అనుష్క.. మళ్లీ పాత లుక్‌లోకి మారడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సినిమాల్లో తనను నాజూగ్గా చూపించడానికి గ్రాఫిక్స్ వాడుతున్నారనే వాదన ఉంది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిలో ఆమెను చూసినా.. ఘాటి ప్రోమోల్లో గమనించినా ఆ విషయం అర్థమవుతుంది. ప్రమోషన్లలో పాల్గొనడానికికి ఇదే సమస్యగా ఉండొచ్చని.. తన ఒరిజినల్ లుక్‌తో బయటికి రాలేని స్థితిలోనే ఆమె ప్రమోషన్లకు దూరంగా ఉందనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి.