ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని పెద్దలు ఊరికే అనలేదు. పోలీసులపై వైసీపీ అధినేత జగన్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే వైసీపీ నేతలు మాట్లాడకుండా ఉంటారా? కచ్చితంగా ఉండరు..ఉండలేరు. ఎందుకంటే తమ అధినేత చూపిన దారిలో నడిచే వైసీపీ నేతలు ఆయన మెప్పు పొందేందుకు ఆయన కంటే రెండు మాటలు ఎక్కువే అంటారు. ఆ కోవలోనే పోలీసులపై మాజీ మంత్రి పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో, నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పేర్ని నానిపై ఏలూరు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతోపాటు దెందులూరు నియోజకవర్గంలో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా నాని మాట్లాడిన క్రమంలో ఆయనపై కేసు నమోదైంది. పోలీసులపై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను నూజివీడు డీఎస్పీ ఖండించారు.
కాగా, కృష్ణా జిల్లా జడ్పీ చైర్ పర్సన్ హారికపై టీడీపీ గూండాలు దాడి చేశారంటూ పేర్ని నాని గతంలో విమర్శించారు. హత్యాయత్నం చేస్తున్నా పోలీసులు చూస్తూ ఉండిపోయారని ఆరోపించారు. టీడీపీ గూండాల దాడికి పోలీసులు రక్షణగా ఉన్నారని, పోలీసుల సమక్షంలో దాడి జరిగితే ఇది సైకో పాలన కాదా? అని ప్రశ్నించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటారన్న నమ్మకం లేదన్నారు.