ఏపీ మాజీ సీఎం జగన్ దూకుడు స్వభావం గురించి ఎన్నో విమర్శలు, ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. పోలీస్ స్టేషన్లో ఎస్సైని కొట్టడం మొదలు...ఉన్నతాధికారులను బెదిరించడం వరకు జగన్ పై ఆరోపణలు కోకొల్లలు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపిన ముంతాజ్ హోటల్ భూముల కేటాయింపు వ్యవహారంలో అజయ్ అనే వ్యక్తిని జగన్ స్వయంగా పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో గన్ పెట్టి బెదిరించారని బీఆర్ నాయుడు ఆరోపించారు.
హిందువులంతా పరమ పవిత్రంగా భావించే తిరుమల ఏడుకొండలను ఆనుకొని ఉన్న పవిత్రమైన స్థలాన్ని ముంతాజ్ హోటల్‌కు జగన్ సర్కార్ కేటాయించడంపై ఆయన మండిపడ్డారు. కోట్లాది రూపాయల టీటీడీ నిధులను వైసీపీ నేతలు కొట్టేశారని ఆరోపించారు. ముంతాజ్ హోటల్ వివాదాన్ని పరిష్కరించడంలో సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. హోటల్ యాజమాన్యంతో మాట్లాడి వారికి మరోచోట 25 ఎకరాల స్థలం ఇచ్చేలా ఒప్పించారని చెప్పారు. టీటీడీ భూములను ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారన్న ప్రచారాన్ని ఖండించారు.
ముంతాజ్ భూముల వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని వైసీపీ నేతలు డిమాండ్ చేయడం హాస్యాస్పదమన్నారు. డబ్బు వెదజల్లి అందరినీ కొనడం వారికి అలవాటుగా మారిందని చురకలంటించారు. తిరుపతిలో నివసించే అర్హత భూమనకు లేదని, ఆయనను తిరుపతి నుంచి తరిమికొట్టాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.