సీఎం చంద్రబాబుకు పని రాక్షసుడు అని పేరుంది. పాలనా దురంధరుడిగా ఆయనను అధికారులు కూడా ప్రశంసిస్తుంటారు. అదే విధంగా సమర్థవంతులైన వారిని గుర్తించడంలో, వారికి కీలక బాధ్యతలు అప్పగించడంలో చంద్రబాబు తర్వాతే మరే ముఖ్యమంత్రి అయినా అంటే అతిశయోక్తి కాదు. పనిచేసే వారికి తగిన పదవులు కేటాయించడంలో చంద్రబాబుది అందె వేసిన చేయి. ఈ క్రమంలోనే తాజాగా డాక్టర్ కృష్ణమోహన్‌ను ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు(ఏపీఎన్నార్టీ) సొసైటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా సీఎం చంద్రబాబు నియమించారు. ఒక ఏడాది పాటు కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ పదవిలో ఆయన కొనసాగనున్నారు.
ఏపీ సీఆర్ డీఏ సామాజిక అభివృద్ధి గ్రూప్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ పి. కృష్ణమోహన్ ట్రాక్ రికార్డ్ చూస్తే ఆయనకు ఈ పదవి దక్కడం సముచితం అనిపిస్తుంది. పాలనాపరంగా అపారమైన అనుభవం ఉన్న ఆయన ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) ప్రాజెక్టులకు సంబంధించి సామాజిక భద్రతల పర్యవేక్షణను సమర్థవంతంగా నిర్వహించారు. మూడు దశాబ్దాలుగా ప్రభుత్వంలోనూ, విద్యా రంగాలలో సేవలందించిన అనుభవం ఆయన సొంతం.
ఐవీఐఎస్ టెక్నాలజీస్– వైస్ ప్రెసిడెంట్(2019–2022), సీఎం ప్రత్యేక అధికారిగా, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవోగా(2015–2019), ఎస్పీఏ విజయవాడ–రిజిస్ట్రార్ (2012–2015), ఎన్ఐఎఫ్ టీ హైదరాబాద్ –రిజిస్ట్రార్(2005–2009), ఏపీసీఆర్డీఏ గ్రూప్ డైరెక్టర్(2024-ప్రస్తుతం)...
2014-19 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన పసుపు కుంకుమ పథకం, చంద్రన్న బీమా, ఎన్టీఆర్ భరోసా వంటి పథకాల అమలులో కృష్ణమోహన్ సేవలు వెలకట్టలేనివి. గ్రామీణ మహిళల కోసం శిక్షణ, పెట్టుబడి, మార్కెటింగ్, మైక్రో ఇరిగేషన్(సూక్ష్మ సేద్యాన్ని) వంటి వాటిని ఆయన ప్రోత్సాహించారు. డీఎఫ్ఐడీ, ప్రపంచ బ్యాంక్ ప్రాజెక్టులకు మార్గదర్శకత్వం వహించి సీఎం చంద్రబాబు మెప్పు పొందారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి ఎకానామిక్స్ లో పోస్ట్-డాక్టరల్ ఫెలోషిప్ చేసిన కృష్ణ మోహన్ 2002లో భారత మాజీ రాష్ట్రపతి డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. ఏపీఎన్నార్టీ సీఈవోగా నియమితులైన కృష్ష మోహన్ కు పలువురు ఎన్నారైలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.