భారత్ పై అమెరికా విధించిన 50 శాతం సుంకాల వ్యవహారం ఇరు దేశాల మధ్య రాజకీయ వేడి రాజేసింది. ఈ టారీఫ్ లపై భారత్ తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై భారత ప్రధాని మోదీ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ నాలుగు సార్లు ఫోన్ చేసినా మోదీ స్పందించలేదని ప్రచారం జర్మన్ పత్రిక ఫ్రాంక్‌ఫర్టర్ అల్గెమైన్ జైటుంగ్ ప్రచురించిన కథనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ట్రంప్ చర్యలపై మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లు ఆ కథనంలో పేర్కొంది. భారత రైతుల ప్రయోజనాలను కాపాడుకోవడంలో మోదీ రాజీ పడబోరని, అందుకే ట్రంప్‌తో మాట్లాడటానికి మోదీ విముఖత వ్యక్తం చేశారని తెలిపింది.
ఈ నేపథ్యంలోనే మోదీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్-పాక్ ఘర్షణలను తానే ఆపానని గతంలో గప్పాలు కొట్టిన ట్రంప్ తాజాగా మరోసారి ఆ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీకి తానే స్వయంగా ఫోన్ చేసి యుద్ధాన్ని 24 గంటల్లో ఆపమని చెప్పానని, కానీ, 5 గంటల్లోనే యుద్ధం ఆపేశారని మోదీని ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. అంతేకాదు, మోదీని వాణిజ్యపరంగా బెదిరించడం వల్లే ఇండో-పాక్ ల మధ్య కాల్పుల విరమణ జరిగిందని ట్రంప్ అన్నారు.
అయితే, ట్రంప్ వాదనలను భారత్ ఖండించింది. ట్రంప్ ఆరోపణల్లో వాస్తవం లేదని, ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కేవలం డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) స్థాయి అధికారుల మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ఫలితమని భారత్ చెబుతోంది. 'ఆపరేషన్ సిందూర్' సమయంలో మూడో వ్యక్తి ప్రమేయం లేదని, ఏ దేశ నాయకుడూ సైనిక చర్య ఆపమని కోరలేదని మోదీ పార్లమెంటులో వెల్లడించారు.