టీటీడీపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఖండించిన సంగతి తెలిసిందే. టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తున్న భూమనను తిరుపతి నుంచి తరిమికొట్టాలని ఆయన అన్నారు. దీంతో, బీఆర్ నాయుడు వ్యాఖ్యలపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. కరుణాకర రెడ్డిని తిరుపతి నుంచి తరిమి కొట్టడం ఎవరి వల్లా కాదని, బీఆర్ నాయుడును స్వామి వారే తరిమి కొడతారని అంబటి అన్నారు. ఈ క్రమంలోనే కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి సవిత కౌంటర్ ఇచ్చారు.
టీటీడీ పాలన, కూటమి ప్రభుత్వంపై భూమన కరుణాకర్ రెడ్డి అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని సవిత మండిపడ్డారు. తమ ప్రభుత్వం జోలికి వైసీపీ నేతలు వస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. జగన్ హయాంలో టీటీడీకి సంబంధించిన 20 ఎకరాలను ముంతాజ్ హోటల్ కు కట్టబెట్టడాన్ని ఆమె తప్పుబట్టారు. కూటమి ప్రభుత్వం, కొత్త టీటీడీ బోర్డు ఆధ్వర్యంలో తిరుమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు, వసతులు కల్పించామని చెప్పారు. ఏపీలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని వినాయకుడిని కోరుకున్నానని సవిత చెప్పారు. కాణిపాకంలో వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.