పెన్షన్లపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్న వైనంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అబద్ధాలపైనే వైసీపీ పునాదులున్నాయని మండిపడ్డారు. పెన్షన్ల విషయంలో వైసీపీకి కనీసం మాట్లాడే అర్హత కూడా లేదని, ఆ పార్టీ తమను విమర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్లను రూ. 30 నుంచి ప్రారంభించి...నేడు రూ. 4000కు పెంచిన చరిత్ర టీడీపీదని అన్నారు. ఈ వాస్తవాలను ప్రతి ఒక్కరికీ వివరించాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు.
తమ పార్టీ చేసిన తప్పులను ఇతరులపైకి నెట్టడంలో వైసీపీ నేతలు దిట్టలని చంద్రబాబు విమర్శించారు. జగన్ హయాంలో అనర్హులకు పింఛన్లు ఇచ్చారని, దాంతో, అర్హులకు నష్టం జరుగుతోందని దుయ్యబట్టారు. కాబట్టి, అనర్హులను తొలగించి, అర్హులకు న్యాయం చేయాలని సంకల్పించినట్లు వివరించారు. సెప్టెంబర్ 6న అనంతపురంలో 'సూపర్-6 సూపర్ హిట్' పేరుతో భారీ సభ నిర్వహిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. గతంలో గొడవలు, దాడులతో ఉన్న వాతావరణాన్ని మార్చి, ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారించామన్నారు.