ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసిన కేసులో మలయాళ నటి పేరు తెర మీదకు రావటం సంచలనంగా మారింది. గజరాజు.. ఇంద్రుడు.. చంద్రముఖి 2 తదితర డబ్బింగ్ సినిమాల్లో నటించిన ఆమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. తాజాగా ఒక ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ చేసి.. దాడి చేసిన ఉదంతంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితుల్లో సంబంధం ఉన్న నటి లక్ష్మీమేనన్ పరారీలో ఉండటంతో ఆమె కోసం గాలిస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇంతకూ అసలేం జరిగిందన్న విషయాన్ని కొచ్చి నగర పోలీసు కమిషనర్ విమలాదిత్య వెల్లడించారు. ఒక బార్ వద్ద నటి లక్ష్మీ మేనన్.. ఆమెకు సంబంధించిన వారు వర్సెస్ ఐటీ ఉద్యోగి టీం మధ్య వివాదం తలెత్తింది. అయితే.. ఆ గొడవ అక్కడితో ముగించకుండా.. ఐటీ ఉద్యోగి కారును లక్ష్మీ, ఆమె స్నేహితులు ఫాలో చేశారు. ఐటీ ఉద్యోగి కారును మధ్యలోనే ఆపేసి.. అతడ్ని బలవంతంగా తమ కారులోకి ఎక్కించుకొని దాడి చేశారు.
అనంతరం అతడ్ని విడిచి పెట్టారు. బాధితుడు తనపై జరిగిన దాడిని పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇప్పటివరకు దాడికి పాల్పడిన ఉదంతంలో ముగ్గురిని అరెస్టు చేయగా.. నటి లక్ష్మీ మేనన్ కోసం గాలిస్తున్నారు. ఆమె కనిపించకుండా పోవటంతో ఆమెను అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం ఆమెపై ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు.