తాను పట్టిన కందేటికి మూడే కాళ్లు అన్నట్లుగా వ్యవహరించటం అగ్రరాజ్యం అమెరికాకు కొత్తేం కాదు. ఇంతకాలం లేనిది ఇప్పుడు రష్యా - ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేసేందుకు ట్రంప్ కొత్త అంశాల్ని తెర మీదకు తీసుకురావటం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే భారత్ కు సుంకాల మోత మోగించారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును భారత ఆపేయాలని.. అదే జరిగితే రష్యా ఎక్కువ కాలం యుద్దం చేయలేదన్నది అగ్రరాజ్య ఆలోచన. అయితే. రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు ఆపేస్తే.. ఆయిల్ బిల్లు తడిచి మోపడు కావటం ఖాయం.
అందుకే.. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసే విషయంలో వెనక్కి తగ్గేది లేదననట్లుగా భారత్ వ్యవహరిస్తోంది. ఎంతసేపటికి తన ప్రయోజనాల్ని మాత్రమే చూసుకునే అమెరికా.. భారత్ ముడి చమురు అవసరాల్ని పరిగణలోకి తీసుకోని పరిస్థితి. ఇలాంటి వేళలో ఏదో ఒక దేశం మీదా ఆధారపడే కన్నా.. మన మీద మనం.. మన దేశ ప్రజల అవసరాలు మాత్రమే పాలకులకు ముఖ్యం కావాలి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అండ్ టీం మాత్రం భారత్ మీద తమ అక్కసును వెళ్లకక్కేందుకు అస్సలు వెనుకాడటం లేదు. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘకాలం సాగటానికి భారతే కారణమని వైట్ హౌస్ సలహాదారు పీటర్ నవారో తాజాగా విమర్శించారు. దీన్ని మోడీ యుద్ధంగా ఆయన పేర్కొన్నారు. రాయితీపై రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు చేయటం ద్వారా మాస్కో దూకుడుకు ఆజ్యం పోసిందని పేర్కొన్నారు.
భారత్ చర్యల కారణంగా అమెరికా పన్ను చెల్లింపుదారులు నష్టపోవాల్సి వస్తోందన్న ఆయన.. రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ ఆపేసినట్లుగా పేర్కొంటే.. అమెరికా విధించే సుంకాల్ని 25 శాతానికి తగ్గించకోవచచన్నారు. భారత్ మీద అమెరికా విధించిన 50 శాతం సుంకాలు నిన్నటి(బుధవారం) నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పీటర్ నవారో ఒక టీవీ చానల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు.
ఈ సందర్భంగా భారత్ తీరును వెలెత్తి చూపే ప్రయత్నం చేశారు. రష్యా - ఉక్రెయిన్ మధ్య ప్రశాంత వాతావరణ నెలకొనాలంటే రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోలు ఆపేయాల్సి ఉంటుందన్నారు. ఆ దిశగా భారత్ చర్యలు తీసుకున్న తర్వాతి రోజు నుంచి పాతిక శాతం సుంకాల్ని అమలు చేస్తామన్నారు. సుంకాల విధింపు వేళ.. భారత్ స్పందిస్తున్న తీరుపై విస్మయాన్ని వ్యక్తం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ లాంటి పరిణితి చెందిన నాయకుడు ఎందుకిలా వ్యవహరిస్తున్నారో తమకు అర్థం కావట్లేదన్నారు. భారత్ మీద ఇన్నేసి వ్యాఖ్యలు చేసిన సదరు కీలక నేత.. రష్యా నుంచి ముడి చమురు భారత్ కంటే ఎక్కువగా కొనుగోలుచేసే చైనా విషయాన్ని మాత్రం ప్రస్తావించకపోవటం గమనార్హం. ఇదొక్క అంశం చాలు అగ్రరాజ్య ద్వంద వైఖరి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవటానికి ఈ ఉదంతం ఒక చక్కటి ఉదాహరణగా చెప్పక తప్పదు.