తాజాగా జరిగిన వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని వైసీపీ అధినేత జగన్ తొలిసారి గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. దాదాపు గంటన్నర సేపు పార్టీ కార్యాలయంలో జరిగిన పూజలో పాల్గొని వినాయక చవితి కథను వినడంతో పాటు అక్షతలు కూడా నెత్తిన చల్లుకోవడం, ప్రసాదం స్వీకరించడం చాలాసేపు స్వామికి పూజలు చేయడం వంటివి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది సాధారణంగా ఏ చంద్రబాబు నాయుడో, పవన్ కళ్యాణ్ చేసి ఉంటే అది వేరేగా ఉండేది. దీని గురించి పెద్ద చర్చ కూడా ఉండేది కాదు. కానీ, ఆశాంతం క్రిస్టియన్ అయిన జగన్ గణపతి పూజ చేయటం రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.
దీనికి మరో ప్రధాన కారణం కూడా ఉంది. రెండు రోజుల కిందట టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు జగన్ ఫ్యామిలీ పై సంచలనం వ్యాఖ్యలు చేశారు. జగన్ కు దమ్ముంటే సతీమణితో సహా తిరుమలకు వచ్చి గుండు కొట్టించుకుని స్వామివారి తిరునామం పెట్టుకొని ప్రసాదాలు స్వీకరించాలని ఆయన సవాల్ విసిరారు. అంతేకాదు, జగన్ క్రిస్టియానిటీ అని అయినప్పటికీ తిరుమలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయిస్తున్నారని, అనవసర రాద్ధాంతానికి తెరతీస్తున్నారని నాయుడు ఆరోపణలు గుప్పించారు. ఇది జరిగిన రెండు రోజులకే జగన్ అనూహ్యంగా గణపతి నవరాత్రులలో పాల్గొనడం పూజలు చేయటం ప్రసాదాన్ని స్వీకరించటం అక్షింతలు నెత్తిన చల్లుకోవడం వంటివి జరిగాయి.
అంటే.. పరోక్షంగా జగన్ బిఆర్ నాయుడుకు కౌంటర్ ఇచ్చారా లేకపోతే రాజకీయంగా బిజెపికి మరింత చేరువ అవుతున్నారా అనేది ఆసక్తిగా మారింది. వాస్తవానికి జగన్ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటారని ఎవరు ఊహించి ఉండరు. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జగన్ గణపతి పూజలో పాల్గొన్నారు. హిందూ వ్యతిరేక ఓటు బ్యాంకు చీల్చాలనేది సాధారణంగా జగన్ విషయంలో ఆది నుంచి జరుగుతోంది. జగన్కు క్రిస్టియానిటీ పేరును ప్రచారం చేయడం వెనుక, ఆయనను తిరుమలకు వస్తే డిక్లరేషన్ పై సంతకం చేయమని కోరడం వెనక కూడా హిందూ ఓటు బ్యాంకును వైసీపీకి దూరం చేయాలన్న ప్రత్యర్థుల వ్యూహం స్పష్టంగా ఉంది.
రాజకీయాల్లో ఏది తప్పు కాదు. ఓటు బ్యాంకు రాజకీయాల్లో ప్రధానంగా ప్రత్యర్థులను దెబ్బతీయటం అనేది ప్రధానం. ఈ విషయంలో ఎవరిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో చూసుకున్నప్పుడు జగన్ తనంతట తాను కాపాడుకోవడమే లక్ష్యంగా తాజాగా ఆయన వినాయక చవితి పండుగలో పాల్గొన్నారు. ఇదే సమయంలో కేంద్రంలోని బిజెపికి కూడా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారన్నది సమాచారం. మొత్తంగా ఒకే ఒక కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా అన్ని వర్గాలకు జగన్ సమాధానం చెప్పారా అనేది చూడాల్సి ఉంది. వాస్తవం ఏంటంటే ఇన్నాళ్లలో ఎప్పుడు జగన్ నేరుగా వినాయక చవితి పండుగలో పాల్గొనడం గాని, పూజలు చేయటం గాని లేదు.