ఏపీలోని కూటమి ప్రభుత్వంలో రాజకీయ రచ్చ రేగింది. వైసీపీకి అనుకూలంగా బీజేపీ నాయకుడు, కేం ద్రంలో కీలక శాఖకు మంత్రిగా ఉన్న మహారాష్ట్ర నేత.. స్పందించిన తీరు.. టీడీపీ-జనసేనలలో కలవరం రేపింది. ``ఇదేం పద్ధతి?`` అంటూ ఈ వ్యవహారంపై నాయకులు చర్చించుకున్నారు. పైగా ఆ కేంద్ర మంత్రి బీజేపీకి కరడు గట్టిన నాయకుడు కూడా కావడం గమనార్హం. దీంతో ఈ వ్యవహారంపై మరింత రచ్చ సాగుతోంది. పైకి ఎవరూ బహిరంగ వ్యాఖ్యలు చేయకపోయినా.. సదరు కేంద్ర మంత్రి వ్యవహారాన్ని సీరియస్‌గానే తీసుకున్నారు.
ఏం జరిగింది?
వైసీపీ వర్సెస్ కూటమికి మధ్య ఉన్న రాజకీయాలు తెలిసిందే. నిరంతరం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కూడా కామన్‌గానే మారిపోయింది. ఇలాంటి సమయంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తుతూ.. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇది అసాధారణమని నాయకులు చెబుతున్నారు. కేంద్రంలో మంత్రిగా ఉన్న గడ్కరీ.. వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలపడం ఏంటన్నది ప్రశ్న.
అంతేకాదు.. కూటమికి బద్ధ శత్రువు, పోటీ అయిన.. వైసీపీ విషయంలో కేంద్ర మంత్రే ఇలా వ్యవహరించ డం పట్ల కూడా టీడీపీ, జనసేన నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ-బీజేపీ మధ్య తెరచాటు బంధం ఉందని వస్తున్న ఆరోపణలను ఈ ఘటన నిజం చేస్తోందన్నది వారి వాదన. దీంతో ప్రజలకు తాము ఏం సమాధానం చెప్పాలని కూడా చర్చించుకుంటున్నారు. అయితే.. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ఎంపీలు.. ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు మద్దతు తెలిపారు.
రాధాకృష్ణన్.. ఆర్ ఎస్ ఎస్ వాది కావడం, ఆర్ ఎస్ ఎస్‌లో నితిన్ గడ్కరీతో కలిసి పనిచేసిన నేపథ్యంలో ఆయనకు మద్దతు తెలుపుతున్న వైసీపీ పై గడ్కరీ ప్రేమ చూపిస్తున్నారన్నది మరోచర్చ. ఈవ్యవహారం ఎలా ఉన్నప్పటికీ.. రాజకీయంగా కూటమికి డ్యామేజీ అయ్యేలా ఉందని నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై కూటమి నేతలు చర్చోపచర్చలు చేస్తున్నారు.