గత వీకెండ్లో మూడు తెలుగు చిత్రాలు రిలీజయ్యాయి. కానీ వాటిని మించి కొత్త లోక అనే మలయాళ అనువాద చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. సత్యరాజ్ ప్రధాన పాత్రలో మోహన్ శ్రీవత్స అనే యువ దర్శకుడు రూపొందించిన త్రిబాణధారి బార్బరిక్ అనే చిత్రానికి ఓ మోస్తరు టాక్ రాగా.. వసూళ్లు చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. ఐతే ఈ సినిమా బాగా ఆడుతుందని ఆశించిన భంగపడ్డ దర్శకుడు తన బాధను వెల్లడిస్తూ సోషల్ మీడియాలో పెట్టిన సెల్ఫీ వీడియో అందరినీ కదిలిస్తోంది.
తన సినిమా బాగున్నప్పటికీ, థియేటర్లకు వచ్చి జనం చూడడం లేదంటూ అతను తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. కన్నీళ్లు పెట్టుకోవడంతో పాటు తనను తాను చెప్పుతో కొట్టుకుని తన ఆక్రోశాన్ని వెళ్లగక్కడం గమనార్హం. త్రిబాణధారి బార్బరిక్ విడుదలకు ముందు.. ఈ సినిమా నచ్చకపోతే తనను తాను చెప్పుతో కొట్టుకుంటానని సవాలు విసిరాడట మోహన్ శ్రీవత్స. ఐతే ఇప్పుడు సినిమా బాగున్నా సరే జనం చూడట్లేదని..
ఇప్పుడు తాను ఏం చేయాలి అంటూ అతను చెప్పు తీసి చెంపమీద కొట్టుకున్నాడు. బార్బరిక్ సినిమా ప్రదర్శితమవుతున్న ఒక థియేటర్‌కు వెళ్తే పది మందే ఉన్నారని.. ఆ పది మందికి తాను ఎవరో చెప్పకుండా వెళ్లి సినిమా ఎలా ఉందని అడిగానని.. అందరూ చాలా బాగుందని చెప్పారని.. తర్వాత తాను ఈ సినిమా దర్శకుడిని అని చెబితే తనను హగ్ చేసుకుని అభినందించారని శ్రీవత్స తెలిపాడు.
ఐతే బాగున్న సినిమాకు ఎక్కడా జనం లేరని.. మంచి సినిమాను ఆదరించకపోతే ఏం చేయాలని అతను ప్రశ్నించాడు. ఈ సినిమా కోసం తాను రెండున్నరేళ్ల పాటు కుక్కలా కష్టపడ్డానని అతనన్నాడు. తాను, తన భార్య కలిసి ఒక షో చూసేందుకు వెళ్లామని.. తాను మధ్యలో ఇంటికి వెళ్లిపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానేమో అని భయపడి తన భార్య పరుగెత్తుకుని వచ్చేసిందని మోహన్ శ్రీవత్స తెలిపాడు.
తెలుగు ప్రేక్షకులకు మలయాళ సినిమాలే ముఖ్యమని.. వాటినే ఆదరిస్తారని.. తాను కూడా మలయాళ ఇండస్ట్రీకి వెళ్లిపోయి అక్కడ సినిమాలు చేసి ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులకు చూపిస్తానని అతను వ్యాఖ్యానించాడు.