ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ప్రాంగణంలో ఏపీ ఎన్ఆర్ టీఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఆస్ట్రేలియా తెలుగు డయాస్పోరా సమావేశానికి ముఖ్య అతిథిగా లోకేశ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సిడ్నీలో భారత కాన్సులేట్ జనరల్ డాక్టర్ ఎస్.జానకీ రామన్, ఏపీ ఎన్ఆర్ టీఎస్ ప్రెసిడెంట్ డాక్టర్ వేమూరి రవికుమార్, వెంకటేష్ ఎనికేపాటి, కిషోర్ బలుసు, విజయ్ చెన్నుపాటి, నవీన్ కుమార్ నేలవల్లి, విశ్వనాథ్ దాసరి తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ప్రసంగించిన లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగోళ్లు లేని దేశం లేదని, అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు తెలుగు ప్రజలదే డామినేషన్ అని అన్నారు. ఆస్ట్రేలియా ప్రధానికి కూడా ఈ రేంజ్ స్వాగతం లభించదని ఆస్ట్రేలియా ప్రభుత్వ అధికారి ఒకరు తనతో అన్నారని లోకేశ్ చెప్పారు. తెలుగు ప్రజల జోష్ వేరని, వారి మాస్ జాతర సూపర్ అని చెప్పారు.
అందరం కలిసికట్టుగా రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకుందామని లోకేశ్ పిలుపునిచ్చారు. మళ్లీ తెలుగువారు గర్వంగా తలెత్తుకునే పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు ఎన్ఆర్ఐలు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు పాలనలో ఏపీకి గత 16 నెలల్లోనే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. కేంద్ర సహకారం వల్ల గూగుల్ సిటీ రాష్ట్రానికి వచ్చిందని అన్నారు. ఏపీకి ఎన్ఆర్ఐలు బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని పిలుపునిచ్చారు.
తెలుగు వాడి పౌరుషాన్ని ఢిల్లీకి పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ అని, తెలుగోడి సత్తాను ప్రపంచానికి పరిచయం చేసింది చంద్రబాబు అని గుర్తు చేశారు. కంప్యూటర్ అన్నం పెడుతుందా అని ఆనాడు ఐటీ రంగాన్ని డెవలప్ చేస్తున్న చంద్రబాబును చూసి చాలామంది ఎద్దేవా చేశారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు వారి నోటి నుంచి మాట రావడం లేదని అన్నారు. క్వాంటం కంప్యూటింగ్ గురించి చంద్రబాబు ఎంతో స్టడీ చేశారని, అందుకే ఆయనను విజనరీ లీడర్ అంటామని చెప్పారు. ఇంకొకరిని ప్రిజనరీ అంటామని పరోక్షంగా జగన్ ను విమర్శించారు లోకేశ్.
చంద్రబాబు అరెస్టు సమయంలో ఆస్ట్రేలియాలోని ప్రతి సిటీ లో ఎన్నారైలు నిరసన కార్యక్రమాలు చేపట్టారని, తమ కుటుంబానికి అండగా నిలబడ్డారని గుర్తు చేసుకున్నారు. ఏపీని కాపాడేందుకు 2024 ఎన్నికలను ఎన్నారైలు తమ సొంత ఎన్నికల్లా భావించారని, తామే పోటీ చేస్తున్నట్లు భావించి కూటమి గెలుపు కోసం అహర్నిశలు కష్టపడ్డారని అన్నారు. అందరం కష్టపడి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల బండి అని, ఈ రెండింటినీ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.
‘‘గత 16 నెలలుగా మీరు చూస్తే.. ఏ రాష్ట్రానికి రాని విధంగా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు ఒక్క ఏపీకి వచ్చాయి. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ నినాదం. అనంతపూర్ ను ఒక ఆటోమోటివ్ హబ్ గా, ఉత్తర అనంతపూర్, కర్నూలును రెన్యూవబుల్ ఎనర్జీ హబ్ గా తీర్చిదిద్దుతున్నాం. లైమ్ స్టోన్ ఉన్న దగ్గర సిమెంట్ పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం. చిత్తూరు, కడపను ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ హబ్ గా మారుస్తాం. నెల్లూరుకు రిఫైనరీని కూడా తీసుకురాబోతున్నాం.
ప్రకాశం జిల్లాను సీబీజీ హబ్ గా, కృష్ణా, గుంటూరు జిల్లాలను క్యాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీగా, ఉభయ గోదావరి జిల్లాలను ఢిఫెన్స్ హబ్ గా తీర్చిదిద్దేందుకు కష్టపడుతున్నాం. కర్నూలుకు డ్రోన్ సిటీని ఇప్పటికే ప్రకటించాం. పనులు కూడా మొదలుపెడుతున్నాం. ఉత్తరాంధ్రను మెడికల్ డివైజ్ మ్యానుఫాక్చరింగ్, ఫార్మా హబ్ తో పాటు స్టీల్ సిటీగా, ఇప్పుడు ఏకంగా డేటా సిటీగా తీర్చిదిద్దుతోంది మీ ప్రజా ప్రభుత్వం.
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నాం. దేశంలో చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్లు ఉన్నాయి. ఒక్క ఏపీలోనే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ ఉంది. కేంద్రంలో నరేంద్ర మోదీ గారు, రాష్ట్రంలో చంద్రబాబునాయుడు గారు.. ఇద్దరూ కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. విశాఖ ఉక్కును కాపాడుకున్నాం, రైల్వే జోన్ ను ఏర్పాటుచేసుకున్నాం, ఆగిపోయిన అమరావతి పనులు తిరిగి ప్రారంభించాం. ఐదేళ్లలో పోలవరం పనులు కూడా పూర్తిచేసి గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తీసుకెళ్తాం.
కేంద్ర సహకారంతో కొప్పర్తి నోడ్, ఓర్వకల్లు ఇండస్ట్రియల్ నోడ్, ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్, నక్కపల్లి ఫార్మాసిటీ.. ఇలా అనేక కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం. వాస్తవంగా గూగుల్ సిటీ కూడా మనకు వచ్చిందంటే దానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వ సహకారం. గూగుల్ ను ఏపీకి రావాలని నేను కోరినప్పుడు కేంద్రంలో కొన్ని చట్టాల్లో సవరణలు చేయాలని చెప్పారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రధానితో మాట్లాడారు. అప్పుడు ప్రధాని స్వయంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గారితో మాట్లాడి చట్టాలను సవరించే పరిస్థితి. ఆర్సెల్లర్ మిట్టల్ ప్రాజెక్ట్ విషయంలోనూ ఇదేవిధంగా జరిగింది.
ఒక్క జూమ్ కాల్ ద్వారా దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వచ్చింది. మరోవైపు నాకు సోదర సమానుడైన పవనన్న. ఒక క్లారిటీతో కలిసికట్టుగా ముందుకు వెళ్దామని చెప్పారు. పొత్తు ఉన్నప్పుడు చిన్న, చిన్న సమస్యలు ఉంటాయి. వచ్చే 15 ఏళ్ల పాటు కలిసికట్టుగా ఏపీని ముందుకు తీసుకెళ్దామని పదేపదే చెబుతున్నారు. అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నెం.1గా ఉండాలనేదే ఏకైక అజెండా. మళ్లీ తెలుగువారు గర్వంగా తలెత్తుకునే పరిస్థితి రావాలి.
గత ఐదేళ్లు మనం తలదించుకుని బతికిన పరిస్థితి. పీపీఏలను రద్దు చేశారు. అనేక ప్రాజెక్టులను రద్దు చేశారు. దానివల్ల ఏపీతో పాటు దేశం కూడా తీవ్రంగా నష్టపోయింది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలనే లక్ష్యంతో పవనన్న, చంద్రబాబు గారు కలిసికట్టుగా పరిపాలిస్తున్నారు. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
మీరు మీ కంపెనీల్లో బ్రాండ్ అంబాసిడర్స్ కావాలని ఇక్కడున్న వారిని కోరుతున్నా. ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడండి. మీరు మాట్లాడితే మార్కెటింగ్ ఈజీ నాకన్నా. ఏదైనా కంపెనీ దేశంలో పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పుడు మాకు తెలియజేయండి. ఆ డీల్ క్లోజ్ చేసే బాధ్యత మేం తీసుకుంటాం. గడచిన ఐదేళ్లు మీరు మాతో కలిసి పోరాడారు. మనం మన రాష్ట్రాన్ని కాపాడుకున్నాం. ఇప్పుడు కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని మనం పునర్ నిర్మాణం చేయాలి.
ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దే లక్ష్యంలో మీరందరూ భాగస్వామ్యం కావాలి. అద్భుతమైన అవకాశాలు ఉంటాయి. ఏదీ అంత సులభం కాదు. నా జీవిత ప్రయాణం చూస్తే మీకు అర్థమై ఉంటుంది. కష్టపడదాం. ఒక ఫోకస్ తో పనిచేద్దాం. ఎదురుదెబ్బలు తగిలినా నిలబడదాం. మన రాష్ట్రాన్ని మనం నిర్మించుకుందాం.
నాకు గూగుల్ ఎంత ముఖ్యమో ఎంఎస్ఎంఈలు కూడా అంతే ముఖ్యం. ఏపీఎన్ఆర్టీలో మీకు మద్దతుగా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేస్తాం. దానిని ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డుకు లింకప్ చేస్తాం. నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తే నేను మీకు అండగా నిలబడతా. ఒక్కసారి ఏపీలో పెట్టుబడులు పెడితే అది మీ ప్రాజెక్ట్ కాదు.. మన ప్రాజెక్ట్. ఆస్ట్రేలియా లో సుమారు 75 వేల మంది తెలుగు వాళ్లు ఉన్నారు. న్యూజిలాండ్ లో 25 వేల మంది తెలుగు వాళ్లు ఉన్నారు.
21 వేల మంది తెలుగు విద్యార్థులు ఆస్ట్రేలియాలో చదువుకుంటున్నారు. మీకు ఏపీ ఎన్ఆర్ టీ ఎప్పుడూ అండగా నిలబడుతుంది. ఓంక్యాప్ ద్వారా లక్ష మందికి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ రోజు మీ ముందు ఉన్నానంటే కారణం ఆస్ట్రేలియా ప్రభుత్వం. ఐదేళ్ల నుంచి స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ కు రావాలని ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు అనేక యూనివర్సిటీలను కలుస్తున్నాం. అందరం కలిసకట్టుగా పనిచేస్తే చరిత్రను తిరగరాయవచ్చు.’’ అని లోకేశ్ అన్నారు.