ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు విద్యా శాఖా, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే లోకేశ్ కు సిడ్నీ విమానాశ్రయంలో టీడీపీ ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ విజయ్, వైస్ ప్రెసిడెంట్ సతీష్, ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు. బ్రిస్బేన్, క్యాన్బెర్రా, అడిలైడ్, మెల్బోర్న్, న్యూజిలాండ్, న్యూకాసిల్ నుంచి పలువురు ఎన్నారైలు తరలివచ్చి లోకేశ్ కు స్వాగతం పలికారు. వారందరినీ పలకరించిన లోకేశ్ ఫోటోలు దిగారు.
నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న పార్టనర్‌షిప్ సమ్మిట్–2025కు ఫోరంకు హాజరు కావాలని పలువురు పారిశ్రామికవేత్తలను లోకేశ్ ఆహ్వానించనున్నారు. ఏపీలోని ఇంధనం, ఓడరేవులు, లాజిస్టిక్స్, డిజిటల్ వంటి కీలక రంగాల్లోని అవకాశాలను ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ సీఈవోలకు వివరించనున్నారు. కృష్ణపట్నం, విశాఖపట్నం, అనంతపురం ఇండస్ట్రియల్ క్లస్టర్లలో ఆస్ట్రేలియన్ కంపెనీలు భాగస్వామ్యం అయ్యేలా చూడడమే ఈ పర్యటన లక్ష్యం.