దేశవ్యాప్తంగా నేడు దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. తమ తమ కుటుంబాలకు దూరంగా ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వారు కూడా పండుగను కుటుంబంతో కలిసి జరుపుకునేందుకు సొంత ఊళ్లకు వస్తున్నారు. అయితే, ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ మాత్రం పండుగ పూట కూడా ఏపీకి పెట్టుబడుల వేటలో బిజీబిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే లోకేశ్ చేసిన ఒక ట్వీట్ వైరల్ అయింది. "ఇదిగోండి.. నా దీపావళి ఇలా సాగుతోంది" అంటూ
సిడ్నీలో ఆస్ట్రేలియా-ఇండియా సీఈఓ ఫోరమ్ నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఫొటోను లోకేశ్ షేర్ చేశారు. సిడ్నీలో లోకేశ్ ‘పెట్టుబడుల’ దీపావళి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హెచ్‌ఎస్‌బీసీ సీఈఓ ఆంథోనీ షా నేతృత్వంలోని ఆస్ట్రేలియాకు చెందిన పలువురు అగ్రశ్రేణి వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలతో లోకేశ్ నేడు భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని, ఇన్వెస్ట్ చేసేందుకు ఉన్న అపార అవకాశాలు ఇవేనని వారికి వివరించారు. కూటమి ప్రభుత్వ పారదర్శక విధానాలు, సులభతరమైన అనుమతుల వల్ల 16 నెలల వ్యవధిలోనే రాష్ట్రానికి 120 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు వచ్చాయని లోకేశ్ వివరించారు.
ఈ కార్యక్రమంలో అమెజాన్, సిస్కో, ఈవై, హెచ్‌సీఎల్ టెక్, కేపీఎంజీ, మాస్టర్‌కార్డ్ వంటి దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, ఆస్ట్రేలియాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పాల్గొన్నారు. గూగుల్ కంపెనీ ప్రతినిధి అలెక్స్ కూడా ఈ సమావేశంలో పాల్గొని ఏపీ ప్రభుత్వంపై బలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేయడం పట్ల లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. పారిశ్రామికవేత్తలందరినీ ఈ ఏడాది నవంబర్‌లో విశాఖలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానించారు.