సీఎం చంద్రబాబు తన చేతికి ఎముక లేదని మరోసారి నిరూపించారు. ఏదైనా నిర్ణయం తీసుకునే విషయంలో ఎంతో ఆలోచన చేసే చంద్రబాబు.. సదరు నిర్ణయం తీసుకోవాలని భావించాక మాత్రం ఎంత ఖర్చుకైనా వెనుకాడరన్న విషయం తెలిసిందే. తాజా గా దీపావళి ముంగిట అన్ని వర్గాలను సంతృప్తి పరుస్తూ.. రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్న కరువు భత్యం(డీఏ) సహా పోలీసులు ఎదురు చూస్తున్న ఆర్జిత సెలవులు(ఈఎల్) వేతనానికి సంబంధించి చంద్రబాబు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఈ రెండు కలిపి సుమారు.. 2 వేల కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అయినప్పటికీ.. చంద్రబాబు వాటికి ఆమోదం తెలిపారు. దీపావళి సందర్భంగా వాటిని ప్రకటించిన సీఎం చంద్రబాబు.. వచ్చే నెల నుంచి అమలు చేయనున్నట్టు తెలిపారు. ఫలితంగా ఇన్నాళ్లు ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగులకు వెసులుబాటు కలిగింది. మరోవైపు.. తాజాగా ఆదివారం సాయంత్రం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిశ్రమ వర్గాలకు బకాయి ఉన్న సొమ్ముపై సీఎం చంద్రబాబు ఉదారంగా వ్యవహరించారు. పలు రాయితీలకు సంబంధించి పరిశ్రమ వర్గాలకు ప్రభుత్వం సొమ్ములు చెల్లించాల్సి ఉంది.
ఈ క్రమంలో వీటిపైనా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీపావళి కానుకగా ఏకంగా రూ.1500 కోట్ల రూపాయలను ఇవ్వను న్నట్టు చంద్రబాబు ప్రకటించారు. తద్వారా పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు బోనస్‌ల రూపంలో ఆయా కంపెనీలు ఇవ్వనున్నా యి. అదేవిధంగా పరిశ్రమలకు కూడా మంచి ఊతం ఇచ్చినట్టు అవుతుంది. ఈ రెండు కూడా దీపావళి సమయంలోనే సీఎం చంద్రబాబు నిర్ణయించడం గమనార్హం. దీంతో ఆయా వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలావుంటే.. దీపావళిని పురస్కరించుకుని సచివాలయ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై కూడా చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. వారికి దీపావళి కానుకగా ఒక్కొక్కరికి రూ.2000 చొప్పున ప్రకటించారు. ఈ మొత్తాన్ని వచ్చే నెల వేతనంలో కలిపి ఇవ్వనున్నారు.