విశాఖలో 15 బిలియన్ డాలర్ల భారీపెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ ప్రాజెక్టుపై ప్రముఖ ఎకనమిస్ట్, జర్నలిస్ట్ స్వామినాథన్ అయ్యర్ స్పందించారు. ఇది కేవలం ఒక ప్రాజెక్టు, ట్రోఫీ కాదని, భారత ఏఐ రంగంలో ఇది ఒక చరిత్రాత్మక మలుపు అని అన్నారు. ఏఐ రంగానికి ప్రపంచ కేంద్రంగా భారత్ మారబోతోందని, గూగుల్ తర్వాత మరెన్నో ప్రముఖ ఏఐ కంపెనీలు భారత్ వైపు రావడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు.
అమెరికా ప్రతి ఏటా సుమారు 8.2 లక్షల మంది సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ గ్రాడ్యుయేట్లను తయారు చేస్తోందని, కానీ, ఏఐ రంగంలో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఆ సంఖ్య సరిపోదని అన్నారు. చైనాలో ఆ సంఖ్య ప్రతి ఏటా 35 లక్షలు అని, కానీ, ఇంగ్లీష్‌లో వారికి నైపుణ్యం లేకపోవడం, భద్రతా కారణాల రీత్యా చైనా గ్రాడ్యుయేట్లకు కంపెనీలు ఎక్కువ ప్రాధాన్యతనివ్వవని చెప్పారు. అదే, భారత్ ప్రతి సంవత్సరం 25 లక్షల మంది ఇంగ్లీష్ మాట్లాడగల గ్రాడ్యుయేట్లను ఉత్పత్తి చేస్తోందని, 2027 నాటికి 1.8 కోట్ల మంది గ్రాడ్యుయేట్లతో విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ప్రపంచ ఏఐ హబ్‌గా భారత్ అవతరిస్తుందని అంచనా వేశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ తో అమెరికా వెలుపల అవకాశాలను కంపెనీలు వెతుకుతున్నాయని, ఆ క్రమంలోనే భారత్‌ను గూగుల్ ఔట్‌సోర్సింగ్ కేంద్రంగా కాకుండా తన ప్రధాన ఉత్పత్తి కేంద్రాల్లో ఒకటిగా చూస్తోందని చెప్పారు. 20 ఏళ్ల క్రితం ఒక ఐటీ ప్రాజెక్టులో 70% పని అమెరికాలోనే జరిగితే, 30% మాత్రమే భారత్ లో ఔట్‌సోర్స్ పద్ధతిలో జరిగేదని అన్నారు. ఇప్పుడు 90% పని భారత్ నుంచే జరుగుతోందని చెప్పారు. హెచ్1బీ వీసాలపై పన్నులు భారీగా విధించడంతో గ్లోబల్ కంపెనీలు భారత్ వైపు తిరిగి వస్తున్నాయిని తెలిపారు.
గూగుల్ వంటి కంపెనీల పెట్టుబడి ద్వారా భారత్‌కి సాంకేతిక సామర్థ్యం, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, మరియు ఆర్థిక వృద్ధి లభిస్తాయని అన్నారు.విశాఖపట్నం లో గూగుల్ డేటా సెంటర్ విజయవంతమైతే ప్రపంచ ఏఐ శక్తిగా భారత్ మారడం ఖాయమని అభిప్రాయపడ్డారు.