ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పెట్టుబడుల వేట మొదలుబెట్టిన సంగతి తెలిసిందే. అమెరికా, దావోస్, జర్మనీ, సింగపూర్, ఆస్ట్రేలియా...ఇలా పలు దేశాలు చుట్టేస్తున్నారు. కాలికి బలపం కట్టుకొని విదేశీ పర్యటనలతో ఓ వైపు చంద్రబాబు..మరోవైపు లోకేశ్ బిజీబిబీగా ఉన్నారు. పండుగలు..పబ్బాల కన్నా రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యమని భావించిన లోకేశ్...దీపావళి నాడు ఆస్ట్రేలియాలో పెట్టుబడుల దివాళీ చేసుకున్నారు. ఇక, సీఎం చంద్రబాబు రేపటి నుంచి మూడు రోజుల పాటు యూఏఈలో పర్యటించనున్నారు.
3 రోజుల టూర్ లో చంద్రబాబు 25 సమావేశాల్లో పాల్గొనబోతున్నారు. విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ విజయవంతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. చంద్రబాబు అక్టోబర్ 22న ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు దుబాయ్‌లో ల్యాండ్ అవుతారు. ప్రభుత్వ ప్రతినిధులతో 3 సమావేశాలు, పారిశ్రామికవేత్తలతో 14 వన్-టు-వన్ భేటీలు, రౌండ్ టేబుల్ సమావేశాలతో బిజీబిజీగా ఉంటారు. 2 సైట్ విజిట్స్, 2 మీడియా ఇంటర్వ్యూలు, సీఐఐ ఆధ్వర్యంలో ఒక రోడ్‌షో, తెలుగు ప్రవాసులతో మరో భేటీలో ఆయన పాల్గొంటారు. రోజుకు ఐదారు సమావేశాలతో చంద్రబాబు బిజీబిజీగా గడపనున్నారు.
అక్టోబర్ 22న చంద్రబాబు 5 ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో భేటీ కాబోతున్నారు. శోభా గ్రూప్, షరాఫ్ డీజీ, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, లూధా గ్రూప్, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ వంటి సంస్థల అధినేతలతో ఆయన వన్-టు-వన్ భేటీలు నిర్వహించనున్నారు. పర్యటనలో చివరి రోజు దుబాయ్‌లో ఏపీఎన్ఆర్‌టీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే తెలుగు డయాస్పోరా సమావేశంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు. రాష్ట్రాభివృద్ధిలో ప్రవాసాంధ్రుల భాగస్వామ్యంప చర్చించనున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు వెంట మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్ధన్ రెడ్డి, సీఎం కార్యదర్శి కార్తికేయ మిశ్రా, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, ఏపీ ఈడీబీ సీఈవో సాయికాంత్ వర్మ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవో ధాత్రిరెడ్డి తదితరులు ఉంటారు.