అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన భారీ సుంకాలతో ఏపీలో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ట్రంప్ దెబ్బకు ఆక్వా రైతులు కుదేలయ్యారు. ఇలా దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న ఏపీ ఆక్వా రైతులకు మంత్రి లోకేశ్ తీపి కబురు చెప్పారు. ఆక్వా రైతులకు భారీ ఊరట లభించేలా ఆస్ట్రేలియా ప్రభుత్వంతో లోకేశ్ కీలక ఒప్పందం చేసుకున్నారు. భారత రొయ్యల దిగుమతికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ కీలక నిర్ణయం తీసుకుందని లోకేశ్ తెలిపారు. వైట్ స్పాట్ వైరస్ కారణంగా భారత రొయ్యల దిగుమతిపై ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.
మరోవైపు, ఆస్ట్రేలియాలో అతిపెద్ద ప్రభుత్వ వృత్తి విద్యా శిక్షణ సంస్థ TAFE NSW (టెక్నికల్ అండ్ ఫర్దర్ ఎడ్యుకేషన్ - న్యూ సౌత్ వేల్స్) అల్టిమో క్యాంపస్ (సిడ్నీ)ను లోకేశ్ సందర్శించారు. ఏపీలోని ప్రాధాన్యతా రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను స్థాపించేందుకు APEDB/APSSDCలతో కలిసి పనిచేసే అంశాన్ని పరిశీలించాలని ఆయన కోరారు. ఏపీలోని ఇండస్ట్రియల్ కారిడార్లలో TAFE NSW స్కిల్ హబ్ లేదా ఇంటర్నేషనల్ క్యాంపస్ స్థాపనకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అన్నారు. ఐటీఐలు, నైపుణ్య శిక్షణ సంస్థల కోసం పాఠ్యప్రణాళిక రూపకల్పన, ఉపాధ్యాయ శిక్షణ కోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖలో నిర్వహించబోతున్న పార్టనర్‌షిప్ సమ్మిట్ - 2025కు హాజరుకావాలని ఆహ్వానించారు.