పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా విడుదలైనప్పటి నుండి రికార్డుల పరంపర కొనసాగిస్తోంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి పవర్ స్టార్ ఫ్యాన్స్ దాహం తీర్చింది. అయితే ఇప్పుడు ఈ బ్లాక్‌బస్టర్ సినిమాపై ఓ కొత్త వివాదం రగిలింది. ఓజీ సినిమాకు కాపీ మరకలు అంటుకున్నాయి. కన్నడ మూవీ నుంచి ఓజీ స్టోరీని కొట్టేశారని అంటున్నారు.
కన్నడ దర్శకుడు ఆర్. చంద్రు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ హీరోగా యాక్ట్ చేసిన ‘ఓజీ’ తన దర్శకత్వంలో రూపొందిన ‘కబ్జా’ సినిమాకు కాపీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. “పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ నా కబ్జా సినిమా నుంచి స్ఫూర్తి పొంది తీశారు. కొన్ని సన్నివేశాలు, సెట్‌లు, హీరో కేరక్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ అన్నీ నా మూవీకే దాదాపు సమానంగా ఉన్నాయి,” అని చంద్రు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి, అభిమానుల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ కామెంట్లు విన్న పవన్ అభిమానులు డైరెక్టర్ చంద్రుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఓ ఫ్లాప్ సినిమా తీసిన వ్యక్తి, బ్లాక్‌బస్టర్ మూవీనే కాపీ అంటున్నాడా?”, “ముందుగా హిట్ ఇవ్వడం నేర్చుకో, తర్వాత లెక్చర్లు ఇవ్వు” అంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు.
కాగా, కబ్జా మూవీ 2023లో వచ్చింది. ఉపేంద్ర హీరోగా నటించిన ఈ సినిమా కూడా గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుంది. భారీ విజువల్ స్కేల్, రేట్రో టోన్ ఉన్నప్పటికీ, స్టోరీ ప్రెజెంటేషన్ లోపాల కారణంగా కబ్జా ఫ్లాప్ అయింది. ఇక ఓజీ విషయానికి వస్తే.. పవన్ కల్యాణ్‌ను మాస్ లుక్‌లో చూపిస్తూ, ఎమోషన్, యాక్షన్, స్టైల్ మిశ్రమంగా సుజీత్ మలచిన గ్యాంగ్‌స్టర్ డ్రామా. ఇందులో కథ, స్క్రీన్‌ప్లే, హీరో ఎలివేషన్ సీన్స్ అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే కథా ములం ఒకే జానర్ అయినప్పటికీ, రెండు సినిమాల్లోని ఎమోషనల్ లేయర్స్, పాత్రల నిర్మాణం, నేరేటివ్ స్టైల్ పూర్తిగా వేరు అని సినీ విశ్లేషకులు చెబుతున్న మాట.