ఏపీలో పెట్టుబడుల వరద కొనసాగుతున్న విషయం తెలిసిందే. కేవలం 16 మాసాల కూటమి పాలనలో ఏకంగా 10 లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు తీసుకువచ్చారు. దీనికి అదనంగా 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ డేటా కేంద్రం కూడా వచ్చింది. ఇది విశాఖపట్నంలో కొలువు దీరనుంది. రాజకీయ నేతల వ్యాఖ్యలు, విమర్శలు ఎలా ఉన్నా.. మేధావులు.. ఐటీ రంగ నిపుణులు ఈ పెట్టుబడిని.. గూగుల్ తీసుకున్న నిర్ణయాన్నిస్వాగతిస్తున్నారు.
అంతేకాదు.. పలువురు ప్రముఖ యూట్యూబర్లు కూడా గూగుల్ డేటా కేంద్రం రాకను స్వాగతిస్తూ.. వీడియో లు చేసి పోస్టు చేశారు. వీటికి భారీ ఎత్తున లైకులు, షేర్లు వస్తున్నాయి. అందరూ కూడా గూగుల్ డేటా కేం ద్రం రాకతో.. రాష్ట్ర ముఖ చిత్రం వచ్చే పదేళ్లలో సంపూర్ణంగా మారుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యంగా విశాఖ జిల్లా ప్రగతి పరుగులు పెడుతుందని.. మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా సాకారం అవుతుందని పేర్కొంటున్నారు. ఈ పరిణామాలు.. సీఎం చంద్రబాబు సహా కూటమి నేతలను ఉత్సాహ పరుస్తున్నాయి.
ఇదిలావుంటే.. తమిళనాడు రాష్ట్రంలో గూగుల్ డేటా సెంటర్‌పై ప్రభుత్వ, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఏపీకి గూగుల్ రావడం .. ఇక్కడ డేటా కేంద్రం ఏర్పాటు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు.. ఏపీ సరైన ప్లేస్ అని కూడా వ్యాఖ్యానించారు. విజన్ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ.. పొగడ్తల వర్షం కురిపించారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి.
ఎందుకంటే.. సుందర్ పిచాయ్.. తమిళనాడు వాసి. దీంతో అధికార డీఎంకే పై ప్రధాన ప్రతిపక్షం అన్నా డీఎంకే నేతలు విరుచుకుపడ్డారు. మన రాష్ట్రానికి చెందిన సుందర్ పిచాయ్ సీఈవోగా ఉన్న గూగుల్‌ను తమిళనాడుకు ఆహ్వానించలేక పోయారని సీఎం స్టాలిన్‌పై నిప్పులు చెరిగారు. దీనికి డీఎంకే.. బదులి స్తూ... ఏపీ ప్రభుత్వం భారీ రాయితీలు ఇచ్చిందని.. అంత మనం ఇవ్వలేమని పేర్కొంది. ఈ వివాదం కొనసాగుతున్న సమయంలో మంత్రి నారా లోకేష్ ఆసక్తిగా స్పందించారు.
గూగుల్ వచ్చింది ఏపీకే అయినా.. ఆ సంస్థ ఎంచుకున్నది మాత్రం భారత దేశాన్నన్న విషయాన్ని మరిచిపోరాదని ఆయన సూచించారు. ``ఏక్ భారత్ స్రేష్ఠ భారత్`` నినాదాన్ని గుర్తు చేసుకోవాలని.. రాష్ట్రాలుగా విడిపోయినా.. మనందరం భారతీయులమని.. అందుకే.. దీనిని ఆ కోణంలోనే చూడాలని ఆయన ఎక్స్‌లో స్పందించారు. నారా లోకేష్ వ్యాఖ్యలకు మెజారిటీ నెటిజన్లు లైకులు కొట్టడం గమనార్హం. ``ఔను.. దీనిని ఇలానే చూడాలి`` అని పలువురు వ్యాఖ్యానించారు.