ఏపీకి పెట్టుబడుల వేటలో ఓ వైపు ఏపీ సీఎం చంద్రబాబు, మరోవైపు మంత్రి నారా లోకేశ్ బిజిబిజీగా ఉన్నారు. ఆస్ట్రేలియాలో పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలలో లోకేశ్ తలమునకలై ఉండగా...యూఏఈ టూర్ లో చంద్రబాబు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే అమరావతికి 100 కోట్ల రూపాయల విరాళం ఇచ్చేందుకు దుబాయ్‌కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం శోభా రియాల్టీ గ్రూప్ ముందుకు వచ్చింది. అమరావతిలో ప్రపంచ స్థాయి లైబ్రరీ నిర్మాణానికి రూ.100 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించింది.
దుబాయ్‌లో శోభా రియాల్టీ గ్రూప్ ఛైర్మన్ రవి మేనన్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతిలో గ్లోబల్ ప్రమాణాలతో ఒక స్టేట్ లైబ్రరీని ఏర్పాటు చేసేందుకు తమ సంస్థ తరఫున ఈ విరాళాన్ని అందిస్తున్నానని రవి మేనన్ తెలిపారు. ఈ విరాళం ప్రకటించడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. అమరావతిని ప్రపంచంలోని ఉత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దాలన్నది తన ఆశయమని, ఆ ఆశయానికి ఈ విరాళం ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు.
ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని రవి మేనన్ కు చంద్రబాబు వివరించారు. అమరావతి నిర్మాణ పనులు, ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని స్వయంగా వచ్చి పరిశీలించాలని ఆహ్వానించారు. అమరావతిని ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో అభివృద్ధి చేస్తున్నామని, గ్రీన్ ఎనర్జీ హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామని చంద్రబాబు వివరించారు. అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ, విశాఖపట్నంలోని గూగుల్ డేటా సెంటర్ వంటి ప్రాజెక్టులు ఇప్పటికే పురోగతిలో ఉన్నాయని తెలిపారు.
ఇండస్ట్రియల్ కారిడార్లు, పోర్టు ఆధారిత అభివృద్ధి జోన్లలో టౌన్‌షిప్‌లు, లగ్జరీ హోటళ్లు, ఐటీ పార్కులు, మాల్స్, కన్వెన్షన్ సెంటర్లు, ప్రీమియం హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టవచ్చని రవి మేనన్ కు సూచించారు. శోభా గ్రూప్ తమ ఆదాయంలో 50 శాతం సామాజిక సేవా కార్యక్రమాలకు కేటాయించడాన్ని చంద్రబాబు ప్రశంసించారు. నవంబర్ 14, 15వ తేదీల్లో విశాఖలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు హాజరుకావాలని రవి మేనన్ ను చంద్రబాబు ప్రత్యేకంగా ఆహ్వానించారు.