ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలనాపరంగా ఎన్నో సంస్కరణలు తెచ్చిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తోంది. ఈ క్రమంలోనే పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఏపీలోని డబుల్ ఇంజన్ సర్కార్ మరో అడుగు వేసింది. నవంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి అధికారుల (డి.డి.ఓ.) కార్యాలయాలు ప్రారంభించాలని ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేసే క్రమంలో పాలనాపరమైన సంస్కరణలు తెచ్చామని పవన్ కళ్యాణ్ చెప్పారు. వాటి ఫలాలు ప్రజలకు సక్రమంగా అందించాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. క్లస్టర్ విధానం రద్దు చేసి 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లు చేశామని పవన్ అన్నారు. దాంతో గ్రామీణులకు మెరుగైన సేవలు అందించే వెసులుబాటు కలిగిందని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులతోపాటు, పంచాయతీలు ఆర్థిక స్వయం ప్రతిపత్తి సాధించే విధంగా సరికొత్త ప్రణాళికలు రూపొందించాలని పవన్ ఆదేశించారు. ఫలితాలు ప్రజలకు చేర్చి, పల్లెల అభివృద్ధిలో ఉద్యోగులు క్రియాశీలక బాధ్యత వహించాలని ఉద్యోగులకు దిశా నిర్దేశం చేశారు.