కొద్ది రోజుల క్రితం జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. మాజీ సీఎం జగన్ తో మెగా స్టార్ చిరంజీవి, టాలీవుడ్ ప్రముఖుల భేటీపై బాలయ్య బాబు చేసిన కామెంట్లు కాక రేపాయి. ఆ తర్వాత ఆ వ్యాఖ్యలపై చిరంజీవి స్పందించడం వంటి పరిణామాల నేపథ్యంలో ఆ వ్యవహారం సద్దుమణిగింది. అయితే, అనూహ్యంగా తాజాగా ఆ వ్యవహారంపై జగన్ స్పందించారు. ఆ క్రమంలో బాలకృష్ణపై జగన్ సంచలన ఆరోపణలు చేశారు.
బాలకృష్ణ ఆ రోజు అసెంబ్లీకి తాగి వచ్చారని, అంతేకాకుండా పనీపాట లేని చర్చను అసెంబ్లీలో లేవనెత్తారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాగిన వ్యక్తిని అసెంబ్లీలోకి ఎలా రానిచ్చారని, అలా రానిచ్చిన స్పీకర్ కు బుద్ధి లేదని అయ్యన్నపాత్రుడిపై మరోసారి జగన్ నోరు పారేసుకున్నారు. దాంతోపాటు, బాలకృష్ణ మానసిక స్థితి గురించి ఆయనను ఆయనే ప్రశ్నించుకోవాలని జగన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మరి, ఈ కామెంట్లపై బాలయ్య బాబు స్పందన ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.