2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగం పుంజుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ చూసి ఏపీలో పెట్టుడులు పెట్టేందుకు గూగుల్ మొదలు ఎన్నో కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇక, చంద్రబాబు పాలనపై నమ్మకంలో ఓ వైపు కేంద్రం..మరోవైపు ప్రపంచ బ్యాంకు అమరావతి రాజధాని నిర్మాణం కోసం భారీ స్థాయిలో నిధులు విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అమరావతి మొదటి దశ అభివృద్ధి కోసం రెండో విడతగా రూ. 1700 కోట్లు విడుదల చేసే అవకాశముందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ వెల్లడించారు.
ఈ ఏడాది డిసెంబరు నాటికి విడుదలయ్యే ఆ నిధులతో రాజధానిలో నిర్మాణ పనులు మరింత వేగవంతం కాబోతున్నాయని ఆయన చెప్పారు. అమరావతి మొదటి దశ నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) చెరో 800 మిలియన్ డాలర్ల చొప్పున మొత్తం 1600 మిలియన్ డాలర్లు (రూ. 13,600 కోట్లు) ఆర్థిక సాయం అందించేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. 2025 మార్చిలో ప్రపంచ బ్యాంకు తొలి విడతగా 207 మిలియన్ డాలర్లను విడుదల చేయగా...అందులో దాదాపు 50 శాతం మేర వివిధ పనులకు ఖర్చు చేశామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ తెలిపారు.
ప్రపంచ బ్యాంకు నుంచి దాదాపు రూ. 1800 కోట్లు అందగా అందులో సగానికిపైగా ఖర్చు చేశామని, 75 శాతం ఖర్చు పూర్తయితే రెండో విడత కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఃడిసెంబర్ నాటికి 75 శాతం నిధులు ఖర్చయ్యే అవకాశముందని, తదుపరి విడతలో 1700 కోట్ల రూపాయల నిధులను డిసెంబరులో పొందే చాన్స్ ఉందని చెప్పారు. ఇక, తన వాటాగా రూ. 1400 కోట్లను కేంద్రం కూడా అందించనుంది.