ఏపీలో విద్యుత్ చార్జీల భారంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే, గత ప్రభుత్వం వేసిన ట్రూ అప్ ఛార్జీలు ఎట్సెట్రా ఛార్జీల వల్ల ఇప్పుడు ప్రజల నెత్తిన విద్యుత్ బాంబు పడిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజలకు విద్యుత్ ఛార్జీల భారం తగ్గించేందుకు సీఎం చంద్రబాబు ఆల్రెడీ చర్యలు చేపట్టారు. నవంబరు నెల నుంచి యూనిట్ విద్యుత్ పై 13 పైసలు తగ్గించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే విద్యుత్ ఛార్జీల వ్యవహారంపై మాజీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీవీ వెంకటేశ్వర రావు కీలక ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్)లో భారీ అవినీతి జరిగిందని, ఆ కారణంతోనే వినియోగదారులపై విద్యుత్ చార్జీల భారం పడుతోందని ఆయన ఆరోపించారు.
ఆ అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని తిరుపతిలో ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్‌కు ఏబీవీ ఫిర్యాదు చేశారు. కర్మను తప్పించుకోగలమేమో గానీ, కరెంటు బిల్లును మాత్రం తప్పించుకోలేమని ఏబీవీ అన్నారు. మన పిల్లలైనా ఆ బిల్లులు కట్టాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరో చేసిన అవినీతికి సామాన్య వినియోగదారుడు ఎందుకు భారం మోయాలని ప్రశ్నించారు. రూపాయి విలువ చేసే వస్తువును మూడు రూపాయలకు కొనుగోలు చేసి, ఆ భారాన్ని ప్రజలపై మోపడం అన్యాయమని చెప్పారు.
వైసీపీ హయాంలో అపాయింట్ అయిన సంతోష్ రావు నేతృత్వంలో ఈ అవినీతికి బీజం పడిందని, ఆయనపై వచ్చిన ఆరోపణల గురించి ఆర్టీఐ ద్వారా వివరాలు కోరినా అధికారులు ఇవ్వలేదని ఆరోపించారను. 12 సార్లు అప్పీలు చేసినా సమాచారం ఇవ్వలేదని, 2023 నుంచి ఎస్పీడీసీఎల్‌లో అవినీతి వ్యవస్థీకృతంగా మారిందని విమర్శించారు. అధికారులు, కంపెనీలు కుమ్మక్కై అవినీతి సొమ్మును పంచుకున్నారని ఆరోపించారు. ఈ అవినీతిని అరికడితేనే విద్యుత్ చార్జీలు తగ్గుతాయని అన్నారు.