ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఏపీ విద్యా శాఖా మంత్రి లోకేశ్ కీలక ప్రకటన చేశారు. 2029 నాటికి ఏపీలో ప్రపంచస్థాయి విద్యా వ్యవస్థ ఏర్పాటే లక్ష్యంగా విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నామని లోకేశ్ అన్నారు. మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేడ్ నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో స్టడీ మెల్‌బోర్న్, విక్టోరియన్ ఎడ్యుకేషన్, స్కిల్ ఇనిస్టిట్యూషన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ ఏడాది నుంచి 'లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్' (LEAP) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. 21వ శతాబ్దపు నైపుణ్యాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యమని అన్నారు. ఆట ఆధారిత పాఠ్యాంశాలు, ఏఐ ఆధారిత శిక్షణ, ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ వంటి వినూత్న కార్యక్రమాలు 'లీప్'లో భాగంగా అమలు చేస్తున్నామని తెలిపారు.
సీఎం చంద్రబాబు దార్శనిక నాయకత్వంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని లోకేశ్ అన్నారు. 16 నెలల కాలంలో రాష్ట్రానికి 117 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించామని చెప్పారు. ఏరోస్పేస్, డిఫెన్స్, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, సెమీకండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్, ఫార్మా, టూరిజం వంటి అనేక కీలక రంగాల్లో ఏపీలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయన్నారు.
విశాఖపట్నం ఐటీ, ఇన్నోవేషన్ హబ్‌గా రూపుదిద్దుకుంటోందని, విశాఖలో గూగుల్ 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఏఐ హబ్ నిర్మిస్తోందని తెలిపారు.
అమరావతిలో వచ్చే జనవరి నుంచి దక్షిణాసియాలోనే తొలి 156-క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ సేవలను ప్రారంభించబోతున్నామని లోకేశ్ ప్రకటించారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరగబోతోన్న 'పార్టనర్‌షిప్ సమ్మిట్ - 2025'కు హాజరై ఏపీలోని పెట్టుబడి అవకాశాలను ప్రత్యక్షంగా పరిశీలించాలని ఆస్ట్రేలియన్ పారిశ్రామికవేత్తలను లోకేశ్ ఆహ్వానించారు.