ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియాలో 7 రోజుల పర్యటన ఫలప్రదంగా సాగిందని లోకేశ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో, ప్రగతిలో కొత్త భాగస్వామ్యాలపై ఈ పర్యటన కొత్త నమ్మకం కలిగించిందని అన్నారు. ఆస్ట్రేలియాలోని నాలుగు నగరాలలో పర్యటించానని, అక్కడ పలు విశ్వవిద్యాలయాలను సందర్శించానని చెప్పారు. పలువురు పారిశ్రామికవేత్తలు, ఐటీ కంపెనీల సీఈవోలతో భేటీ అయ్యానని, ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించానని చెప్పారు.
2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు భారత్ పయనిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ శక్తి బలోపేతం కావడం కీలకమని అభిప్రాయపడ్డారు. తన పర్యటన ఫలాలు త్వరలోనే రాష్ట్రానికి అందుతాయని, ఏపీలో పలు కంపెనీలు భాగస్వాములవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తమది స్టార్టప్ రాష్ట్రమని, పారిశ్రామికవేత్తలు తమతో చేతులు కలిపాక పూర్తిగా సహకారం అందిస్తూ ఉంటామని భరోసానిచ్చారు.
అంతకుముందు, మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమిట్ రోడ్‌షో నిర్వహించారు లోకేశ్. నవంబరు 14, 15 తేదీల్లో నిర్వహించే పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు తరలిరావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపిచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంను సందర్శించిన లోకేశ్...క్రికెట్ విక్టోరియా అసోసియేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు.