ఎన్నికల సమయంలో చిన్న పార్టీలు తమకు అనుకూలంగా ఉండే పెద్ద పార్టీలకు మద్దతివ్వడం, ఆ క్రమంలోని కొన్ని సీట్లు, మరిన్ని కోట్లు అడగడం పరిపాటి. అయితే, అప్పటి పరిస్థితులు, రాజకీయ సమీకరణాలు, రకరకాల కారణాలు, పొత్తుల లెక్కలను బట్టి సీట్ల పంపకాలుజరగొచ్చు..జరగకపోవచ్చు.
ఎన్నికల సమయంలో ఎన్ని సీట్లు అడిగిన విషయంపై చాలామంది పెద్దగా మాట్లాడరు. కానీ, ఆ వ్యవహారంపై జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు, న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ కు ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది. టీడీపీతో పొత్తు కోసం నియోజకవర్గానికి కోటి రూపాయల చొప్పున జడ శ్రవణ్ డిమాండ్ చేశారని ఆరోపణలు వచ్చాయన్న ప్రశ్న ఆయనకు ఎదురైంది. ఆ ప్రశ్నకు ఆయన విస్తుపోయే సమాధానమిచ్చారు.
కోటి కాదని...5 కోట్లు అడిగానని, అంతేకాదు, 5 అసెంబ్లీ సీట్లు కూడా డిమాండ్ చేశానని జడ శ్రవణ్ చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. అయింతే, అదంతా రాజకీయ ప్రక్రియలో భాగమని, ఐదేళ్లపాటు ప్రజల కోసం పోరాడాం కాబట్టి అసెంబ్లీలో అడుగుపెట్టాలనుకోవడంలో తప్పేం లేదని చెప్పారు. జనసేన, బీజేపీ కూటమిలోకి వచ్చిన తర్వాత సీట్ల సర్దుబాటు కుదరలేదని, అందుకే తాను కూటమి నుంచి బయటకు వచ్చేశానని తెలిపారు.
2029 నాటికి బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలన్న లక్ష్యంతో ముందుకు పోతున్నామని, రాబోయే నాలుగేళ్లలో కనీసం 10 నుంచి 15 లక్షల ఓటు బ్యాంకు సాధిస్తామని అన్నారు. అప్పుడు తమ డిమాండ్లు సాధించుకోగలమని, ప్రభుత్వాలను ప్రభావితం చేసే శక్తి తమకు వస్తుందని అభిప్రాయపడ్డారు. తమ వర్గం ప్రజల హక్కులను కాపాడేందుకు రాజ్యాధికారం అవసరమని అన్నారు. పరిస్థితులు అనుకూలిస్తే భవిష్యత్తులో వైసీపీతో కలిసి పనిచేయడానికీ సిద్ధమని ప్రకటించారు.