వారికి క్షమాపణలు చెప్పిన కవిత

admin
Published by Admin — October 25, 2025 in Telangana
News Image

ప్రత్యేక తెలంగాణ సాధించుకునే క్రమంలో వేలాదిమంది తెలంగాణ పౌరులు అమరులయ్యారు. దశాబ్దాలుగా చేస్తున్న పోరాటాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లే క్రమంలో శ్రీకాంతా చారి వంటి యువకులు మొదలు ఎందరో తెలంగాణ బిడ్డలు అశువులు బాశారు. అయితే, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కేవలం 500 మంది అమరవీరుల కుటుంబ సభ్యులకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు దక్కాయి. చాలామందికి న్యాయం జరగలేదు. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత క్షమాపణలు చెప్పారు.

తెలంగాణ ఉద్యమకారులకు చేతులెత్తి నమస్కరిస్తూ క్షమాపణ కోరుతున్నానని కవిత అన్నారు. గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత ‘జనం బాట’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో తాను ఎంపీగా, ఎమ్మెల్సీగా సేవ చేశానని, మంత్రి పదవి లేదు కాబట్టి అమరవీరుల కుటుంబాలకు పరిహారం విషయంలో న్యాయం చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అమరవీరుల కుటుంబాల్లో చాలా కుటుంబాలు నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలాసార్లు ఈ విషయాన్ని అంతర్గత భేటీలలో లేవనెత్తానని గుర్తు చేసుకున్నారు.

ఆ విషయంలో తాను తగినంత పోరాటం చేయలేదని, అమరవీరుల కుటుంబాలకు డబ్బులు అందేవరకూ పోరాడాల్సిందని అన్నారు. ప్రతీ అమరవీరుల కుటుంబానికీ రూ.కోటి చొప్పున ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కవిత డిమాండ్ చేశారు. అమరవీరుల స్థూపం సాక్షిగా 1200 మంది అమరవీరుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఈ ప్రభుత్వం నుంచి ఇప్పిస్తానని, లేదంటే ప్రభుత్వాన్ని మార్చైనా సరే ఇప్పిస్తానని శపథం చేశారు

Tags
Kalvakuntla Kavitha Telangana martyrs Apologies
Recent Comments
Leave a Comment

Related News