ఒక్క ఏపీలోని శేషాచలం అడవుల్లో మాత్రమే లభించే ఎర్రచందనానికి ప్రపంచ వ్యాప్తంగా మంచి గిరికీ ఉందని ఏపీ ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. దీనిని అదునుగా తీసుకుని ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠా చెలరేగుతోందన్న ఆయన.. వారి తాట తీసేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసిందన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో కీలకంగా ఉన్న నలుగురు కింగ్ పిన్స్(ముఠా నాయకులు)ను గుర్తించామని.. వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. శనివారం తిరుపతిలో పర్యటించిన ఆయన ఎర్రచందనం గోదాములను పరిశీలించారు. ఇప్పటి వరకు ఎన్ని చందనం దుంగలను పట్టుకున్నారు.. ఎన్ని వేలం వేయాల్సి ఉంది? అనే వివరాలను తెలుసుకున్నారు.
అనంతరం కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడారు. శేషా చలం అడవుల్లో మాత్రమే లభించే ఎర్రచందనం చెట్లను స్మగ్లర్లు అక్రమం గా నరికేస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు 2 లక్షల పైచిలుకు చెట్లను నరికేసినట్టు లెక్కలు తేలాయని, వీరిని అడ్డుకునేందు కు ప్రత్యేక టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేశామని వివరించారు. అదేవిదంగా స్మగ్లర్ల ఆటకట్టించేందుకు పొరుగు న ఉన్న కర్నాటక ప్రభుత్వంతోనూ మాట్లాడామని చెప్పారు. ఎర్రచందనం అక్రమ ముఠాకు నేతృత్వం వహిస్తున్నవారిని గుర్తించామన్న ఆయన వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వెల్లడించారు.
ఎర్రచందనం వృక్షాలను కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని పవన్ కల్యాణ్ చెప్పారు. చెట్లను నరికేం దుకు భారీ ఎత్తున కూలీ ఇచ్చి స్థానిక యువతను తీసుకువెళ్తున్నారని.. ఇది అక్రమమని తెలియక అమాయకులు కేసుల్లో ఇరుక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అక్రమాలకు ఎవరూ కొమ్ము కాయొద్దని చెప్పారు. కరడు గట్టిన మావో యిస్టులను దారిలోకి తెచ్చుకునేందుకు `ఆపరేషన్ కగార్`ను అమలు చేస్తున్న ఈ దేశంలో.. ఎర్ర చందనం స్మగర్ల ఆట కట్టించ డం పెద్ద లెక్క కాదని వ్యాఖ్యానించారు. ఎర్రచందనం అక్రమ దారులు ఇప్పటికైనా దానిని ఆపివేయాలని.. లేక పోతే.. తీవ్రస్తాయి లో స్పందించాల్సి ఉంటుందన్నారు.
అటవీ చట్టం ప్రకారం.. ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేయడంతోపాటు.. వారి ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంటామని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఎర్రచందనం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. స్థానికులు కూడా సహకరించవద్దని ఆయన సూచించారు. అలా కాకుండా.. ప్రభుత్వం ఆపరేషన్ మొదలు పెడితే .. వెనుదిరిగే ప్రసక్తే ఉండదని హెచ్చరించారు. ఎర్రచందనం నరికివేతలో పాల్గొనే తమిళనాడు కూలీలకు కూడా అవగాహన కల్పిస్తామన్నారు.